సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లోని భూములపై రెవెన్యూ శాఖ విచారణను ముమ్మరం చేసింది. 388 ఎకరాల భూముల లెక్క తేల్చేందుకు అధికారులు రెండో రోజు రంగంలోకి దిగగా.. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు సిద్దిపేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎర్రవల్లి నుంచి సిద్దిపేట వరకు రాజకీయ వేడి పెరిగింది.
325 సర్వే నంబర్‌పై ఫోకస్..
మర్కుక్ మండలం ఎర్రవల్లి శివారులోని వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ గ్రామాల సరిహద్దుల్లో ఉన్న 325 సర్వే నంబర్ భూములపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఈ సర్వే నంబర్‌లోని సుమారు 388 ఎకరాల భూముల స్వభావం, విస్తీర్ణం, హద్దులను అధికారులు పరిశీలిస్తున్నారు. గురువారం మూడు గ్రామాల సరిహద్దులను గుర్తించి మార్కింగ్ చేసిన అధికారులు.. రెండో రోజు శాటిలైట్ మ్యాపింగ్ సహా అందుబాటులో ఉన్న రికార్డులతో భూముల విస్తీర్ణాన్ని నిర్ధారించే ప్రక్రియ చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు గత రికార్డులు, ప్రస్తుత రెవెన్యూ నమోదులను పోల్చి భూముల హక్కులు, స్వాధీనం, అసైన్డ్ భూముల వివరాలను పరిశీలిస్తున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
సిద్దిపేటకు కాంగ్రెస్ నేతలు
ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు సిద్దిపేట పర్యటనకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ నుంచి ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి నేరుగా సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లోని అసైన్డ్ భూములపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవోను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. అలాగే రంగనాయకసాగర్ వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావుకు సంబంధించిన ఫామ్‌హౌస్ భూములపైనా విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌ను కోరనున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి 325 సర్వే నంబర్‌లోని 388 ఎకరాల భూములపై పూర్తి వివరాలను బయటకు తేవాలని వారు డిమాండ్ చేయనున్నారు. కాంగ్రెస్ ఎంపీలు ఎర్రవల్లి భూములపై సమగ్ర విచారణ జరుపుతామని ఇప్పటికే ప్రకటించారు.

సీఎం భేటీ తర్వాతే క్లారిటీ..
అయితే సిద్దిపేట పర్యటన విషయంలో కాంగ్రెస్ నేతల్లో చివరి నిమిషంలో కొంత సందిగ్ధత నెలకొన్నట్లు సమాచారం. అసెంబ్లీకి రెండు ఆర్టీసీ బస్సులు చేరుకోగా.. పర్యటనకు వెళ్లాలా? వద్దా? అన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఎంపీలు భేటీ కానున్నారు. పర్యటన సమయంలో అనుకోని ఘటనలు చోటుచేసుకుంటే అసలు భూముల అంశం పక్కదారి పట్టే అవకాశం ఉందన్న ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎంతో ఎంపీల భేటీ తర్వాతే సిద్దిపేట పర్యటనపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: దానం నాగేందర్ అనర్హతపై నేడే హైకోర్టు తీర్పు..


