వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఎందుకు?.. బీజేపీ, జనసేనకు వర్తించదా?? | Police Act Only for YSRCP Party: Leaders Questions Over Vijayawada Restrictions | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఎందుకు?.. బీజేపీ, జనసేనకు వర్తించదా??

Sep 21 2026 10:34 AM | Updated on Sep 21 2026 10:42 AM

Police Act Only for YSRCP Party: Leaders Questions Over Vijayawada Restrictions

సాక్షి, విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆందోళనతో నగరంలో టెన్షన్‌ నెలకొంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాలతో శాప్‌ కార్యాలయం ముందు ఇవాళ నిరసనలకు ఆ పార్టీ ప్రయత్నిస్తుండగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ అడ్డగింతలు, అరెస్టులు, అక్రమ నిర్బంధాల పరంపర కొనసాగుతోంది.

డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి చెబుతోంది. కూటమి ప్రభుత్వం చేసిన ఈ భారీ స్కామ్‌లో.. శాప్‌ కూడా భాగమైందని అంటోంది. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది. 

ఈ క్రమంలో గత కొంతకాలంగా ఒక కార్యచరణతో పోరాటం చేస్తున్న ఆ పార్టీ.. ఇవాళ అభ్యర్థులతో శాప్‌ కార్యాలయం వద్ద ఇవాళ నిరసనకు సిద్ధమైంది. అయితే నగరంలో ఇప్పటికే బీఎన్‌ఎస్‌ఎస్‌ 163, పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉన్నాయని, వినాయక నిమజ్జనాలు, ఊరేగింపులు, ట్రాఫిక్‌ సమస్యలు, పోలీసు సిబ్బంది కొరత కారణంగా ర్యాలీలు, ధర్నాలకు అనుమతి ఇవ్వలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు నిరసనకు అనుమతి లేదని పోలీసులు ముందే ప్రకటించడంతో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

శాప్‌కు మూడు వైపులా భారీ పోలీస్‌ బందోబస్తు కనిపిస్తోంది. కీలక కూడళ్ల వద్ద పోలీసులను మోహరించడంతోపాటు విజయవాడకు వచ్చే మార్గాలపై నిఘా పెట్టారు. గుంటూరు వైపు నుంచి తాడేపల్లి మీదుగా విజయవాడ వచ్చే మార్గంలోనూ పికెట్లు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ, ధర్నా నిర్వహిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పేర్ని నాని, దేవినేని అవినాష్‌ సహా పలువురు నేతలకు నోటీసులు కూడా జారీ చేశారు.

ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణులు పోలీసుల తీరుపై ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై వైఎస్‌ జగన్‌ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికైనా.. కూటమిలో ఒక్కరైనా సమాధానం చెప్పారా? అని నిలదీశారు. అలాగే ఇటీవల జరిగిన కూటమి పార్టీల కార్యక్రమాలను గుర్తు చేశారు. 

‘‘మొన్నీమధ్యే బీజేపీ ర్యాలీ జరిగింది కదా. మరి దానికి ఎలా? ఎందుకు? అనుమతిచ్చారు. శాప్‌ కార్యాలయం ముందు టెంట్లు వేసుకుని కూర్చునే కార్యక్రమాలకు ఈ మధ్యకాలంలో అనుమతులు ఇవ్వలేదా?. పోలీస్‌ యాక్ట్‌ వైఎస్సార్‌సీపీకి మాత్రమేనా? జనసేన, బీజేపీ నేతలకు వర్తించదా? ఇదెక్కడి న్యాయం?? అని నిలదీశారు. ఈ క్రమంలో.. శాప్‌ కార్యాలయం వైపు వెళ్లే ప్రయత్నం చేసిన మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన ఒకవైపు.. పోలీసుల అనుమతి నిరాకరణ, ఆ పార్టీ నేతల ప్రశ్నలు మరోవైపు విజయవాడలో రాజకీయ వేడిని పెంచాయి. పోలీసులు హెచ్చరించినా.. తమ ఉద్యమం ఆగదని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: బాబు ట్రాప్‌లో పవన్‌.. జనసేనలో కొత్త టెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement