వైఎస్సార్‌సీపీ నిరసన అప్‌డేట్స్..
కృష్ణా జిల్లా..
- వైఎస్సార్‌సీపీ డీఎస్సీ నిరసనపై పోలీసుల ఆంక్షలు
- నిరసనలకు హాజరు కావద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు
- మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు
- ఎక్కడికక్కడే పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పోలీసుల నోటీసులు..
నేడు విజయవాడ శాప్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ నిరసన
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం
వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు ఇస్తున్న పోలీసులు
అడ్డుకున్నా శాప్ కార్యాలయానికి వస్తామంటున్న పార్టీ నేతలు
శాంతియుత నిరసనలను ఉద్రిక్తంగా మార్చేందుకు ప్రభుత్వ పెద్దల కుట్రలు
కుట్రలు ఛేదించి నిరసనలు తెలుపుతామంటున్న పార్టీ శ్రేణులు
👉 ఏపీలో డీఎస్సీలో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. నగరంలోని శిఖామణి సెంటర్ నుంచి శాప్ కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది.
👉ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని డీఎస్సీ బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు పాల్గొనాలని కోరింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. వైఎస్సార్‌సీపీ శాంతియుత ర్యాలీకి పోటీగా అక్రమంగా నియామకాలు పొందిన వారితో బలప్రదర్శనకు పథకం రచించారు.
ర్యాలీ, ధర్నాకు అనుమతి లేదు : డీసీపీ
👉మరోవైపు.. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద సోమవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన నిరసన ధర్నా, ర్యాలీలకు అనుమతిలేదని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు, ఊరేగింపులు, ట్రాఫిక్ అంతరాయాలు, పోలీస్ సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని ర్యాలీ, ధర్నాలకు అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. నిరసన ర్యాలీకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. డీఎస్సీ నిరసనలో పాల్గొంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
👉కాగా, నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు శనివారం మాచవరం ఎస్‌ఐ యోగేష్ నోటీసు అందించారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదని సెంట్రల్ ఏసీపీ పేరుతో ఆ నోటీసును అందజేశారు. ర్యాలీ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూటమి పార్టీలకు మద్దతుగా చేసే ర్యాలీలకు అనుమతించే పోలీసులు, ప్రతిపక్షాల ర్యాలీలపై ఉక్కుపాదం మోపడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని..
👉డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు వైఎస్సార్‌సీపీ ఇప్పటికే అనేక ఆధారాలు బయటపెట్టింది. అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చి, గోల్డ్ మెడల్స్ పొందినవారిని పక్కన పెట్టిన వైనాన్ని ఇప్పటికే పలుమార్లు ఆధారాలతో వైఎస్సార్‌సీపీ ప్రజల ముందుంచింది. పరీక్ష లేకుండానే నేరుగా ఉద్యోగాలు ఇచ్చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సైతం అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. దీంతో రోజురోజుకూ డీఎస్సీ అక్రమాలు మరిన్ని వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వంలో ఆందోళన ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ నిరసనలను ఎలాగైనా అడ్డుకునేందుకు పోలీసులను రంగంలోకి దించింది. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ శాంతియుత ర్యాలీకి అనుమతిలేదని చెప్పించింది.
ఇదీ చదవండి: ‘నిన్ను ఎలా నమ్మాలి చంద్రబాబు..’


