‘స్థానిక’ ఎన్నికల సీట్లపై మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలపై జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం
ఎక్కువ సీట్లపై ఆశ పెట్టుకోవద్దని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి?
కచ్చితంగా గెలిచే సీట్లలోనే పోటీ చేద్దామంటే కూటమి కట్టిందెందుకు?
మూడో వంతు సీట్లు తీసుకుంటామన్న పవన్ ఇప్పుడేమంటారు?
జనసేనలో అసలు ఏం జరుగుతోందంటూ శ్రేణుల్లో చర్చ.. నైరాశ్యం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో జనసేన తీసుకునే సీట్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖపట్నం జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఆ పారీ్టలో సెగలు పుట్టిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు కచ్చితంగా మూడో వంతు సీట్లు లేదా అంతకంటే ఎక్కువగా పొత్తుల్లో దక్కుతాయని ఆ పార్టీ శ్రేణులు ఆశ పెట్టుకున్నాయి. అయితే ‘మనం తీసుకునే సీట్లు ప్రతి ఒక్కటీ గెలిచే సీట్లే తీసుకుంటాం. తొందరపడి, ఒత్తిళ్లు వచ్చాయని సంఖ్య పెంచేసుకొని.. 60 ఇవ్వండి, 70 ఇవ్వండి 120లో మేం 120 పోటీ చేస్తామనే ఆలోచన మీరెవరూ (జనసేన నాయకులు, కార్యకర్తలు) పెట్టుకోమాకండి. ఇది ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ. కూటమిలో బాధ్యతయుతంగా ఉందాం’ అంటూ నాదెండ్ల చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు పూర్తిగా డీలా పడిపోయారు. దీంతో సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఓ రేంజ్‌లో ఏకిపారేస్తున్నారు.
ఇది ఒక పద్దతి ప్రకారం జనసేన బలాన్ని తక్కువ చేసినట్టు మాట్లాడి, పొత్తులో పార్టీ తక్కువ సీట్లు తీసుకోవడానికి ముందుగానే పార్టీ నేతలు, కార్యకర్తలందరినీ మానసికంగా సిద్దం చేసే బ్రెయిన్ వాష్ కార్యక్రమం అని దుయ్యబడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం జనసేన బలాన్ని ఇలానే తక్కువ చేసి మాట్లాడి, పొత్తులో తక్కువ సీట్లు తీసుకోవడాన్ని సమర్థించుకున్నారంటూ తూర్పారపడుతున్నారు. మంత్రి నాదెండ్ల వ్యాఖ్యల ప్రకారం స్థానిక ఎన్నికల్లోనూ కేవలం వంద శాతం గెలిచే సీట్లే అంటే మొత్తం సీట్లలో పది శాతానికే పార్టీని పరిమితం చేయబోతున్నారా అని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పొత్తుల్లో.. చిన్న పారీ్టలకు ఉండే బలంతోనే పెద్ద పారీ్టలు సైతం గెలిచే పరిస్థితి ఉంటుందని, అలాంటప్పుడు చిన్న పారీ్టలకు బలం లేని కొన్ని చోట్ల అయినా పెద్ద పార్టీల బలం కలిపి గెలిపించడం కూటమిలో సమ న్యాయం అవుతుందని చెబుతున్నారు.
12 ఏళ్లు అవుతున్నా అవే మాటలా!
‘జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్లు దాటింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఇప్పుడైనా పార్టీ బలపడే దిశగా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని ఆశించాం. అయినా ఇంకా బలం లేదంటూ మాట్లాడుతున్నారు. ఇలాగైతే ఎలా?’ అని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘సీట్లు ఎక్కువ అడగొద్దు. సంస్థాగతంగా మనం ఇంకా బలంగా లేం.. నిదానంగా ఎదుగుదాం.. గెలిచే సీట్లే తీసుకుందాం..’ అంటే జనసేన శ్రేణుల పని కేవలం జెండాలు మోయడం, సభలకు జనాన్ని తీసుకురావడమేనా అని ప్రశి్నస్తున్నారు. పార్టీ పెట్టిన 12 ఏళ్ల తర్వాత కూడా సంస్థాగతంగా బలంగా లేకపోతే.. ఇన్నేళ్లు పార్టీ నిర్మాణం చేయకుండా ఏం చేశారని అధినేత పవన్ కళ్యాణ్‌ను తప్పుపట్టాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కనీసం మూడో వంతు సీట్లు అయినా తీసుకోకుంటే పార్టీ భవిష్యత్ అంధకారమే అని తెగేసి చెబుతున్నారు.
పోటీ చేస్తేనే కదా.. అసలు బలమెంతో తెలిసేది..
సోషల్ మీడియాల్లో కొంత మంది జనసేన అభిమానులు నాదెండ్ల మనోహర్‌ను టీడీపీ కోవర్ట్ అంటూ నేరుగా టార్గెట్ చేయడం గమనార్హం. పొత్తులో మిత్రపక్షంగా ఉన్న పారీ్టలనే రాజకీయంగా అథఃపాతాళానికి నెట్టేలా చేయడం చంద్రబాబు నైజమని.. ఇప్పుడు కూడ సొంత పార్టీ వాళ్లతోనే జనసేనను ఎదగకుండా చేస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ ఎదుగుదల అయినా, ఆయా ప్రాంతాల స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే ఉంటుందని చెబుతున్నారు. పోటీ చేస్తేనే కదా.. అసలు బలమెంతో తెలిసేదని ప్రశి్నస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడుతూ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ పదవులు మొదలు నగర కార్పొరేషన్ పదవుల వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు తీసుకుంటుంది’ అని వ్యాఖ్యానించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం మంత్రి నారా లోకేశ్.. టీడీపీ నేతల సమావేశంలో స్థానిక ఎన్నికల్లో జనసేనకు 15 శాతం టికెట్లేనని స్పష్టం చేయడం.. జనసేన మంత్రి నాదెండ్ల ప్రస్తుతం ఆ దిశగానే శ్రేణులను ఒప్పించే ప్రయత్నం చేస్తుండటం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.


