కనుమరుగవుతున్న సిద్ధేశ్వర గుట్ట | Sand Mining in Chandragiri constituency | Sakshi
Sakshi News home page

కనుమరుగవుతున్న సిద్ధేశ్వర గుట్ట

Sep 21 2026 5:58 AM | Updated on Sep 21 2026 5:58 AM

Sand Mining in Chandragiri constituency

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సి.రామాపురం వద్ద సిద్ధేశ్వర కొండను భారీ యంత్రాలతో తవ్వేసిన టీడీపీ నేతలు

చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి మాఫియా దారుణం 

సి.రామాపురంలో బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు 

భారీ యంత్రాలతో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు.. తరలింపు 

కొండను చదును చేసి ప్లాట్లు వేసి విక్రయించే స్కెచ్‌ 

ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికార యంత్రాంగం

సాక్షి, టాస్క్ ఫోర్స్‌ : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రకృతి సంపదకు రక్షణ కరువవుతోంది. రామచంద్రాపురం మండలంలో కొండ గుట్టలు, ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. భారీ యంత్రాలతో గుట్టలను తొలిచేస్తూ మట్టి, రాళ్లను తరలిస్తున్నారు. దీంతో సహజ సిద్ధమైన గుట్టలు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. రామచంద్రాపురం మండలం సి.రామాపురంలోని సర్వే నంబరు 28లో వున్న సిద్ధేశ్వరగుట్టను టీడీపీ నేతలు చెరబట్టారు. 

ఎక్స్‌కవేటర్లు వినియోగిస్తూ కళ్ల ముందే పిండి చేసేస్తున్నారు. పచ్చని చెట్లను పెకలించి మట్టిని తొలిచేస్తున్నారు. తవ్విన మట్టి, రాళ్లను వాహనాల్లో తరలిస్తున్నారు.సిద్ధేశ్వరగుట్టను చదును చేసి, ఆ ప్రదేశంలో ప్లాట్లు వేసి విక్రయించడానికి స్కెచ్‌ వేసినట్టు సమాచారం. ఇప్పటికే దాదాపు సగం కొండను తొలిచేశారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని వెనుక ఉండి ఈ విధ్వంసం చేయిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిద్ధే శ్వర కొండ రోజురోజుకూ తరిగి పోతోందని, నిత్యం భారీ యంత్రాలతో తవ్వకాలు సాగుతుండటంతో స్వరూపమే మారిపోతోందని చెబుతున్నారు. 

గతంలో పచ్చదనంతో కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు మట్టి దిబ్బగా మారిందన్నారు. కొండను తొలిచేయడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని, ఎలాంటి అనుమతుల్లేకుండా ఇంత భారీగా తవ్వకాలు సాగుతుంటే అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు నిలదీస్తున్నారు. ఎన్ని అర్జీలు పెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదని, తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ విధ్వంసంపై జనసేన మాజీ నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్‌ వేదికగా ప్రశి్నంచారు. ఎమ్మెల్యే పులివర్తి నాని తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పులివర్తి నాని, ఈ అంశంపై తీసుకున్న చర్యలపై బహిరంగ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement