మంజుల(ఫైల్)
కర్నూలు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఒక యువకుడు నమ్మక ద్రోహం చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం రాగానే ముఖం చాటేశాడు. కులం పేరుతో పెళ్లిని నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బీఈడీ చేసిన యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్నూలు నగరం బుధవారపేటకు చెందిన శ్రీదేవి, చిన్న మద్దిలేటి దంపతుల కుమార్తె మంజుల గోనెగండ్లలో తన అమ్మమ్మ ఇంట్లో ఉండి పదో తరగతి, ఇంటర్ చదువుకున్నారు.
ఆ సమయంలో ఈ యువతిని ఇంటికి ఎదురుగా ఉన్న కృష్ణమూర్తి ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఐదేళ్లపాటు ఇద్దరూ కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. మంజుల బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ పరీక్ష రాసి విఫలమయ్యారు. కృష్ణమూర్తికి ఇటీవల టీచర్ ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించిన కృష్ణమూర్తి ప్రభుత్వ ఉద్యోగం సాధించాక మంజులను దూరం పెట్టడం ప్రారంభించాడు.
కులం పేరుతో తిరస్కరణ
ఉద్యోగం వచ్చాక మంజుల పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ కృష్ణమూర్తి చిరాకు పడేవాడు. ఇద్దరం వేర్వేరు కులానికి చెందిన వారమని, కులాలు వేరు కావడంతో పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు. మంజుల తండ్రి చనిపోవడంతో తల్లి శ్రీదేవితో కలిసి కర్నూలు కొత్తపేటలో హోటల్ నడుపుతూ జీవనం సాగించేవారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఈ నెల 16వ తేదీన ఆల్ అవుట్ మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా కుటుంబసభ్యులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు..
చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం తెల్లవారుజామున మంజుల(27) మృతిచెందారు. తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మంజుల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. బుధవారపేటలోని శ్మశానవాటికలో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణమూర్తి స్వగ్రామం గోనెగండ్ల అయితే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కొత్తపేటలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య


