ఆదోని: తిరులమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, కూటమి నేతలు చేసిన ప్రచారం కల్పితమని తేలిపోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేసి ఇచ్చిన నివేదిక చెంపపెట్టు లాంటిదన్నారు. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని నిజంగా అపవిత్రం చేసింది కూటమి పాలకులేనని దుయ్యబట్టారు. జంతుకొవ్వు, చేప నూనె కలిసిందని పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానిస్తే, బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు బాత్‌రూమ్‌కు వినియోగించే యాసిడ్‌ను లడ్డూ తయారీకి వినియోగించారని మరింత దిగజారి మాట్లాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు.
తిరస్కరించిన నెయ్యిని
కొనుగోలు చేసిన కూటమి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తిరస్కరించిన నెయ్యిని 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొనుగోలు చేసిన విషయాన్ని ప్రజలు గ్రహించాలని మాజీ ఎమ్మెల్యే సాయి అన్నారు. ఇదే విషయం సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ నిగ్గు తేల్చిందన్నారు. ప్రజలకు అసలు దోషులెవరో అర్థమైందని చెప్పారు. వేంకటేశ్వర స్వామి దయ వల్ల కల్తీ జరగలేదని తేటతెల్లమైందన్నారు. అసత్య ప్రచారాలను కూటమి నేతలు ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. లేనిపోని అపోహలు సృష్టించి రాద్దాంతం చేసిన ఈ వ్యవహారంపై చంద్రబాబు, పవన్ భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


