కర్నూలు: నగరంలో ఈ నెల 22వ తేదీ నిర్వహించే గణేష్ నిమజ్జన వేడుకలకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు దాదా పు 2000 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తోంది. నిమజ్జనం వేడుకల్లో డ్రోన్, సీసీ కెమెరాలు, వీడియో కెమెరాలతో పోలీసు అధికారులు పర్యవేక్షించనున్నారు. కర్నూలు నగరంలో సుమారు 1500లకు పైగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి కర్నూలు వినాయక ఘాట్‌తో పాటు నంద్యాల రహదారిలో టోల్‌ప్లాజా సమీపంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, డోన్ రహదారిలో ఉల్లిందకొండ సమీపంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాల్వ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశారు. అన్ని చోట్ల కూడా సాంకేతిక పరిజ్ఞానంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశా రు. బందోబస్తు విధుల్లో ఇద్దరు అడిషినల్ ఎస్పీలు, 16 మంది డీఎస్పీలు, 85 మంది సీఐలు, ఆర్‌ఐలు, 150 మంది ఎస్‌ఐలు కలిపి మొత్తం 2000 మంది పోలీసులను మొహరించనున్నారు. ఎవ్వరికి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు విగ్రహానికి ఇద్దరు చొప్పున పోలీసు సిబ్బందిని నియమించారు.
నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
● గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి వేడుకలు పూర్తయ్యే వరకు నగరంలో ట్రాఫిక్ మళ్లించనున్నారు.
● అత్యవసర వాహనాలు 108, ఫైర్, అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు, సేవల కోసం పోలీసులతో అనుమతి పొందిన వాహనాలను మాత్రమే నిమజ్జన మార్గంలో అనుమతిస్తారు.
● అర్టీసీ బస్టాండు నుంచి రాజ్‌విహార్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, వినాయక ఘాట్, గాయత్రీ ఎస్టేటు వరకు ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదు.
● కొత్త బస్టాండు నుంచి ఆర్‌టీసీ బస్సులు, ఇతర వాహనాలు బళ్లారి చౌరస్తా మీదుగా చెన్నమ్మ సర్కిల్ గుత్తి పెట్రోల్ బంక్, బిర్లా జంక్షన్, మద్దూరు నగర్, సీ.క్యాంపు సెంటరు, నంద్యాల చెక్‌పోస్టు మీదుగా వాహనాల రాకపోకలు ఉంటాయి.
● ఆత్మకూరు, నంద్యాల, నందికొట్కూరు వైపు నుంచి నగరంలోకి వచ్చే వాహనాలు సీ.క్యాంపు, బిర్లాగేట్, గుత్తి పెట్రోలు బంకు, బళ్లారి చౌరస్తా మీదుగా బస్టాండుకు చేరుకోవాల్సి ఉంటుంది.
● వినాయక ఘాట్ దగ్గర నిమజ్జనం పూర్తయిన తర్వాత వాహనాలు దేవనగర్, కృష్ణానగర్, కల్లూరు బ్రిడ్జి మీదుగా తిరిగివెళ్లాలి.
అక్కడి వరకే డీజేలకు అనుమతి
రాజ్‌విహార్‌వైపు నుంచే డీజే వాహనాలను కలెక్టరేట్ వరకు, నంద్యాల చెక్‌పోస్టు నుంచి వచ్చే వాటిని మద్దూరు నగర్ మసీదు వరకు, చెన్నమ్మసర్కిల్, శరీన్‌నగర్, గుత్తి పెట్రోల్ బంక్ వైపు నుంచి వచ్చే డీజే వాహనాలను బిర్లా గేట్ వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. నిమజ్జనం రూట్లలో అధిక సంఖ్య ఆసుపత్రులు ఉన్నందున రోగులు, ప్రజల భద్రతలను దృష్టిలో ఉంచుకొని డీజే వాహనాల నియంత్రణ, మళ్లింపు ఉంటుందని, దీనిని గణేష్ ఉత్సవ నిర్వాహకులు దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. అలాగే మతపెద్దలు, రాజకీయ పార్టీలు, యువకులు, నగర ప్రతినిధులు, మీడి యా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యు లు కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ తీసుకునే చర్యలకు సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ కోరారు.
విగ్రహాల నిమజ్జనానికి
మూడు చోట్ల ఏర్పాట్లు
డ్రోన్, సీసీ కెమెరాలు,
వీడియో కెమెరాలతో చిత్రీకరణ
నిమజ్జనం పూర్తయ్యే వరకు
నగరంలో ట్రాఫిక్ మళ్లింపు


