కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో శనివారం ఆర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నందున కోలుకునే అవకాశం లేదు. అత్యధికంగా కృష్ణగిరిలో 54.2 మి.మీ., అత్యల్పంగా ఓర్వకల్లు 4.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద సగటున 18.1 మి.మీ. వర్షం కురిసింది. ఆస్పరిలో 50, వెల్దుర్తిలో 45.6, మద్దికెరలో 36.4, కోడుమూరులో 32.4, ఎమ్మిగనూరులో 25.4, పత్తికొండలో 25.4, ఆదోని–1లో 24.2, నందవరంలో 23.8, మంత్రాలయంలో 18.4 మి.మీ. ప్రకారం వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
క్వింటా వేరుశనగ రూ.9,240
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.9,240 ధర పలికింది. మార్కెట్‌కు 428 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటాకు కనిష్ట ధర రూ.5,009, మధ్యస్థ ధర రూ.8,459 ప్రకారం లభించిందని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. ఆముదాలు 50 క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటాకు గరిష్ట ధర రూ.7,140 లభించిందని పేర్కొన్నారు.
భిక్షాటనతో నిరసన
కర్నూలు(హాస్పిటల్): ఆరోగ్యశాఖలో పనిచేసే కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు ఆదివారం చేతుల్లో ఖాళీ పాత్రలు పట్టుకుని భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. శాంతియుత నిరసన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను, పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సాధారణ బదిలీ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగి మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేఏసీ అధ్యక్షులు శ్రీదేవి, నళిని, పుష్ప, నీలిమ తదితరులు పాల్గొన్నారు.
మల్లన్నకు
నృత్య నివేదన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యకళావేదికపై హైదరాబాద్‌కు చెందిన ఎం.లావణ్య, బృందం వారి సంప్రదాయ నృత్యప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. గణపతికౌత్వం, నమశ్శివాయ, హర హర శంభో, మూషికవాహన, తాండవనృత్యం, అఖిలాండేశ్వరి, శంభో శివశంభో తదితర గీతాలకు అక్షర, అక్షిత, నిత్యశ్రీ, వేదాంశిక, సహస్ర, నక్షత్ర, పవిత్ర తదితరులు నృత్యం ప్రదర్శించారు.


