బాలుడిని ఎత్తుకుని రోదిస్తున్న బంధువులు
తూర్పుగోదావరి: పాము కాటును గమనించక పోవడంతో చికిత్స ఆలస్యమై చిన్నారి మృతి చెందిన ఘటన చింతలచెరువు గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే కృష్ణవరం పంచాయతీ చింతలచెరువులో కుర్సం ధర్మరాజు, విజయ దంపతుల ఆరేళ్ల పెద్ద కుమారుడు జై ప్రణయ్ (6) స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం 11 గంటల వేళ తల్లి విజయ ఇంటి ఆవరణలోని అరటి గెల కోసి కాయలు తీస్తుండగా వాటి మధ్య ఉన్న కట్లపాము ఆమె చేతిపై పడింది. దీంతో ఆమె విదిలించుకోగా అది పక్కనే ఉన్న దుస్తులలో నక్కింది.
బాలుడి పెదనాన్న వచ్చి దానిని చంపేశాడు. ఆ తరువాత తల్లి పొలం పనులకు వెళ్లిపోయింది. కాగా ఆదివారం తెల్లవారు జామున ప్రణవ్ నోటి నుంచి నురగలు రావడం, పాము కాటు పడిన గుర్తులు ఉండి వాపు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆ బాలుడు మృతి చెందాడు. చికిత్స ఆలస్యం కావడం వల్లే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.


