కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాష్ట్రంలో దాదాపు డజను మంది ఎమ్మెల్యేలకు రెండేసి పెళ్లిళ్లు జరిగాయని ఆయన అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే ఈ వ్యాఖ్యపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎవరెవరో పేర్లు కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
వర్షాభావ పరిస్థితులపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో శివకుమార్ బెంగళూరు నగరంపై పెరుగుతున్న జనాభా ఒత్తిడిని ప్రస్తావించారు. బెంగళూరును కెంపేగౌడ నిర్మించారని, విధానసౌధను కేంగల్ హనుమంతయ్య నిర్మించారని, ఎస్.ఎం. కృష్ణ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. నగరానికి వచ్చిన వారు తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లడం లేదని చెప్పారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బెంగళూరుకు వచ్చిన వారు కూడా ఇక్కడే ఉండిపోతున్నారని, “మీలోనూ చాలామందికి రెండు పెళ్లిళ్లు ఉన్నాయి. అలాంటివారు ఓ డజను మంది ఉన్నారు. వారి జాబితా ఇవ్వగలను” అని వ్యాఖ్యానించారు. ధార్వాడ్, దక్షిణ కన్నడ తదితర జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల పేర్లు తనకు తెలుసని, అయితే వాటిని బయటపెట్టడం లేదని చెప్పారు.
"MLAs who come to Bengaluru don't leave, I know dozens who had second marriages and settled here" : Karnataka CM DK Shivakumar while talking about growing population & rapid urbanization in Bengaluru. pic.twitter.com/MA8Kg4Y45g
— Deepak Bopanna (@dpkBopanna) September 25, 2026
అనవసరమైన వ్యాఖ్య: బీజేపీ
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ స్పందించారు. ఇది అనవసరమైన వ్యాఖ్య అని పేర్కొంటూ.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని సీఎం చెబుతున్న ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో బెంగళూరుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేపైనా అనుమానం ఏర్పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను మాత్రం బెంగళూరులోనే పుట్టి పెరిగానని స్పష్టం చేశారు.
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఎస్.సురేశ్ కుమార్ కూడా శివకుమార్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. సీఎం సరదాగా చెప్పి ఉండొచ్చని, కానీ అసెంబ్లీ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభ గౌరవాన్ని పెంచదని అన్నారు. తాను సభలో ఉండి ఉంటే అప్పుడే స్పందించేవాడినని పేర్కొన్నారు.
పేర్లు చెప్పాలి లేదంటే..
రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండు కుటుంబాలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరనే విషయాన్ని సీఎం స్పష్టం చేయాలని సురేశ్ కుమార్ డిమాండ్ చేశారు. పేర్లు వెల్లడించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన ఆసక్తి, సందేహాలు ఏర్పడతాయని అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేలందరినీ అనుమానంగా చూడటం లేదా ఎగతాళి చేసే పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు.
బెంగళూరు డెవలప్‌మెంట్.. జనాభా ఒత్తిడిపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ సందర్భంగా శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు అసలు చర్చను పక్కకు నెట్టి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన ప్రస్తావించిన ఎమ్మెల్యేల పేర్లు మాత్రం ఇప్పటివరకు బహిర్గతం కాలేదు.
ఇదీ చదవండి: రెబల్ ఎంపీలకు గడువు.. రెండు వారాలే!


