భజన క్లబ్బింగ్‌లో మోదీ.. యువతతో కలిసి జోష్‌ | PM Modi Joins Bhajan Clubbing Event In Delhi, Plays Instrument And Claps Along With Young Participants, Video Goes Viral | Sakshi
Sakshi News home page

భజన క్లబ్బింగ్‌లో మోదీ.. యువతతో కలిసి జోష్‌

Sep 26 2026 7:12 AM | Updated on Sep 26 2026 10:17 AM

PM Modi Joins Bhajan Clubbing Grooves With Young Crowd in Delhi Viral

యువతను ఆకట్టుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త తరహా ప్రయత్నం చేశారు. సాధారణ రాజకీయ కార్యక్రమాలకు భిన్నంగా.. యువత ఎక్కువగా పాల్గొనే ఆధునిక భజన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని సందడి చేశారు. భజనలు వింటూ చప్పట్లు కొట్టడంతోపాటు.. చేతిలో వాయిద్యం పట్టుకుని తాళం వేస్తూ కనిపించారు.

పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని దీనదయాళ్‌ ఉపాధ్యాయ పార్క్‌లో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందువరుసలో కూర్చున్న మోదీ.. భజనలను ఆస్వాదిస్తూ కళాకారులతో కలిసి చప్పట్లు కొట్టారు. శ్రీరాముడిపై ఆలపించిన భజనకు ఖంజరీ తరహా వాయిద్యాన్ని వాయిస్తూ తాళం వేశారు. అనంతరం అక్కడికి వచ్చిన వారివైపు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఢిల్లీలో భజన్‌ క్లబ్బింగ్‌.. అద్భుతం! అంటూ ఈ ఈవెంట్‌పై ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారాయన. 

ఏంటీ భజన క్లబ్బింగ్‌..?
సంప్రదాయ భజనలను ఆధునిక సంగీత కచేరీ తరహాలో నిర్వహించే విధానమే ‘భజన క్లబ్బింగ్‌’. ఇందులో పెద్ద సంఖ్యలో యువత ఒకచోట చేరి భజనలు, ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ.. చప్పట్లు కొడుతూ, సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా పాల్గొంటారు. సంప్రదాయ భక్తి గీతాలకు ఆధునిక సంగీతం, హై ఎనర్జీ ప్రదర్శన శైలిని జోడించడం ఈ కార్యక్రమాల ప్రత్యేకత.

మద్యం, ఇతర క్లబ్‌ సంస్కృతికి భిన్నంగా.. భక్తి, ఆధ్యాత్మికత కేంద్రంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ‘భజన క్లబ్బింగ్‌’కు ఆదరణ పెరుగుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా జెన్‌-జెడ్‌ యువతను సంప్రదాయ భజనలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు.

‘మన్‌ కీ బాత్‌’లోనూ ప్రస్తావన
ఈ ఏడాది జనవరిలో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలోనూ మోదీ ‘భజన క్లబ్బింగ్‌’ గురించి ప్రస్తావించారు. యువత భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ పెద్ద సంఖ్యలో ఒకచోట చేరడం తనను ఆకట్టుకుందని చెప్పారు. భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడించే ప్రయత్నంగా దీనిని అభివర్ణించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్లోబల్‌ కచేరీలకు ఏమాత్రం తీసిపోవని పేర్కొన్నారు.

దీనదయాళ్‌ జయంతి సందర్భంగా..
భారతీయ జనసంఘ్‌ కీలక నేతల్లో ఒకరైన దీనదయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ‘అంత్యోదయ’ సిద్ధాంతంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సందర్భంగా మోదీ దీనదయాళ్‌ ఉపాధ్యాయకు నివాళులర్పించారు. ఆయన ఆలోచనలు, ప్రజా సంక్షేమంపై ఆయన చూపిన మార్గం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రిగ్గింగ్‌ జరిగితే పోటీ చేయడమెందుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement