ప్రతిపక్షాలకు అభిజీత్ దీప్కే ప్రశ్న
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో రిగ్గింగ్ జరుగుతోందని భావిస్తే ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొనడం మానుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తేల్చిచెప్పారు. దేశంలో రాజకీయ పార్టీల నిరంతర భాగస్వామ్యం ఎన్నికలకు చట్టబద్ధత కల్పించడమే కాకుండా, అవి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయనే భ్రమను కలిగిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, వాటిలో పాల్గొనడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు దీప్కే శుక్రవారం ఎక్స్‌లో పోస్టుచేశారు.
ఎన్నికలకు దూరంగా ఉంటే రాజకీయ ఉనికికే ముప్పు వాటిల్లుతుందన్న భయంతోనే ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొంటున్నాయా? అని దీప్కే అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల చోరీ జరుగుతున్నప్పుడు, విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇతర పార్టీలు లాగేసుకుంటున్నప్పుడు, ప్రతిపక్షాలు చీలిపోతున్నప్పుడు... ఇంకా ఉనికి కోసం ఆరాట పడడంలో అర్థం లేదని పేర్కొన్నారు. ‘‘ఇది రాజకీయ మనుగడ కాదు. మిమ్మల్ని బలహీనపపర్చగల, మీ పార్టీని చీల్చగల లేదా మీ ప్రజాప్రతినిధులను తొలగించగల వ్యవస్థలో మీరు కేవలం బ్రతికి ఉండటానికి ప్రయతి్నస్తున్నారు. ఇలా మీరు ఎంతకాలం మనుగడ సాగించగలరు?’’అని దీప్కే ప్రతిపక్షాలను నిలదీశారు.


