ఎన్నికల సంఘం వ్యవహారంపై వివాదం మరింత ముదిరింది. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు విధించిన గడువులో ఒక్కరోజు పూర్తైంది. శనివారం నాటికి ఆయన గనుక రాజీనామా చేయకపోతే తమ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించింది. అందుకు ముహూర్తం కూడా ప్రకటించింది.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇవాళ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. గాంధీ జయంతి రోజు ముంబై నుంచి దేశవ్యాప్త ఆందోళనలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ రేపటిలోగా రాజీనామా చేయకపోతే.. అక్టోబర్ 2 నుంచి ముంబైలో నిరసన ప్రారంభించి దేశంలోని ఇతర నగరాలకు విస్తరిస్తాం” అని దీప్కే ఎక్స్‌లో పోస్టు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
అంతకు ముందు సీఈసీ రాజీనామాకు 48 గంటల గడువు ఇచ్చి, అవసరమైతే ‘జంతర్ మంతర్ 2.0’ పేరుతో ఢిల్లీలో మరో ఆందోళన చేపడతామని హెచ్చరించింది. అయితే ఇప్పుడు ముంబైని అందుకు వేదికగా మార్చుకోబోతోంది.
సర్‌పై తీవ్ర అభ్యంతరాలు..
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో కోట్లాది పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి మినహాయించబడ్డాయని సీజేపీ ఆరోపిస్తోంది. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాల్లో లేకుండా పోయాయని ఓ జాతీయ మీడియా కథనం ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఆ సంస్థ విమర్శలు గుప్పిస్తోంది.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో రెండు కోట్లకు పైగా చొప్పున, కర్ణాటకలో సుమారు కోటి, తమిళనాడులో 97 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షలు, తెలంగాణలో 73 లక్షలు, ఢిల్లీలో 47 లక్షలు, కేరళలో 24 లక్షల మేర పేర్లు తొలగించబడ్డాయని సీజేపీ అంటోంది
ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలు..
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దర్యాప్తు కథనం ప్రకారం.. కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీకి ఇద్దరు కమిషనర్ల మధ్య గ్యాప్ నడుస్తోంది. ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14సార్లు ఈసీ నిర్ణయాలపై లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణ, ఫామ్–6 మార్పులు, ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణ వంటి అంశాల్లో తమకు సమాచారం లేదంటే అనుమతి లేకుండానే నిర్ణయాలు జరిగాయని వారు ప్రశ్నించినట్లు ఆ కథనం పేర్కొంది.
మరోవైపు ఈసీ మాత్రం దీనిపై భిన్నమైన వివరణ ఇచ్చింది. బహుళ సభ్యుల రాజ్యాంగ సంస్థలో భిన్నాభిప్రాయాలు, రాతపూర్వక నోట్లు, అంతర్గత చర్చలు సహజమేనని.. గత ఏడాది తీసుకున్న తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.
‘ఎన్నికల్లో పోటీ చేయొద్దు’..
ఇదే సమయంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని చెబుతున్న ప్రతిపక్ష పార్టీలపైనా విమర్శలు చేశారు. ఎన్నికలు ‘రిగ్డ్’ అవుతున్నాయని భావిస్తే.. అలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా వాటికి చట్టబద్ధత కల్పిస్తున్నట్లవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండటం వల్ల తమ రాజకీయ ఉనికి దెబ్బతింటుందనే భయంతోనే ప్రతిపక్షాలు పోటీ చేస్తున్నాయా? అని ప్రశ్నించారు.


