ప్రొఫెసర్‌ను ట్రోల్‌ చేసిన స్టూడెంట్‌.. ఆ తర్వాత ఏమైందంటే? | Nirma University Professor Grabs Student By Collar After Viral Meme Taunt | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ను ట్రోల్‌ చేసిన స్టూడెంట్‌.. ఆ తర్వాత ఏమైందంటే?

Sep 25 2026 12:29 PM | Updated on Sep 25 2026 1:08 PM

Nirma University Professor Grabs Student By Collar After Viral Meme Taunt

గాంధీనగర్‌ : ప్రముఖ అహ్మదాబాద్‌లోని నిర్మా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర దుమారానికి దారితీసింది. స్టాండ్‌అప్ కామెడీ షో సందర్భంగా ఓ విద్యార్థి చేసిన సరదా కామెంట్ ప్రొఫెసర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించగా, ఆయన విద్యార్థిని స్టేజ్‌పైకి పిలిచి కాలర్ పట్టుకోవడం కలకలం రేపింది.

నిర్మా యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు ‘టెక్నోఫోరా 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా ప్రముఖ కమెడియన్ రజత్ సూద్‌ స్టాండ్‌అప్ కామెడీ షో నిర్వహించారు.

‘జల్దీ బోల్, పన్వెల్ నికల్నా హై’ 
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ డిపార్ట్‌మెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ హెచ్.కె. పటేల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ప్రేక్షకుల స్థానంలో ఉన్న ఓ విద్యార్థి.. సోషల్ మీడియాలో బాగా పాపులరైన బాలీవుడ్ సినిమా ‘గోల్‌మాల్ 3’ చిత్రంలోని కునాల్ ఖేము డైలాగ్  ‘జల్దీ బోల్, పన్వెల్ నికల్నా హై’ అని పెద్దగా అరిచాడు.

స్టేజ్‌పై ప్రొఫెసర్ వీరంగం 
ఎవరైనా విషయాన్ని సాగదీస్తుంటే వాడే ఈ మీమ్ డైలాగ్‌తో విద్యార్థి తనను ఉద్దేశించి ట్రోల్ చేయడంతో సదరు ప్రొఫెసర్‌కు చిర్రెత్తింది. వెంటనే సదరు విద్యార్థిని స్టేజ్‌పైకి పిలిచారు. కోపోద్రికులైన ప్రొఫెసర్ స్టేజ్‌పైనే విద్యార్థి కాలర్‌ పట్టుకుని వెనక్కి ఈడ్చుకెళ్లారు. అంతేకాదు నిర్మా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏ ఫ్యాకల్టీ సభ్యుడినైనా అవమానించాలని చూస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను. నీకు ఇక్కడ అదే చివరి రోజు అవుతుంది’ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

 వీడియో వైరల్  
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు విద్యార్థి ఉపాధ్యాయుడి పట్ల అలా ప్రవర్తించి ఉండకూడదని కొందరు వాదిస్తుంటే, మరోవైపు ఎంత కోపం వచ్చినా ఒక ప్రొఫెసర్ హోదాలో ఉండి విద్యార్థిపై భౌతిక దాడికి దిగడం, కాలర్ పట్టుకోవడం సరికాదని మరికొందరు విమర్శిస్తున్నారు.

ఈ ఘటనపై కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ తీవ్రంగా స్పందించింది. ప్రొఫెసర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన విద్యార్థికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో యూనివర్సిటీలో పెద్దఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించింది. ఈ వివాదంపై యూనివర్సిటీ యాజమాన్యం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement