బీజేపీపైనే దూకుడు! ఆప్‌ థ్యాంక్స్‌.. కాంగ్రెస్‌ ట్విస్ట్‌ | Tough on BJP Soft on Opposition: Is CJP Plays Double Standard? | Sakshi
Sakshi News home page

బీజేపీపైనే దూకుడు! ఆప్‌ థ్యాంక్స్‌.. కాంగ్రెస్‌ ట్విస్ట్‌

Sep 21 2026 1:59 PM | Updated on Sep 21 2026 2:14 PM

Tough on BJP Soft on Opposition: Is CJP Plays Double Standard?

జంతర్‌ మంతర్‌ వేదికగా నీట్‌ పేపర్‌లీక్‌ వ్యవహారం, విద్యా వ్యవస్థలో అవకతవకలపై ఉద్యమం చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కాక్రోచ్‌ జనతా పార్టీ. అయితే ఇప్పుడు అది ప్రదర్శిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. స్కూళ్ల బాగు కోసం మీద దేశవ్యాప్త క్యాంపెయిన్‌ నడుపుతున్న ఈ సంస్థ.. పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ తరుణంలో సీజేపీ ఓ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 

‘స్కూల్‌ ఠీక్‌ కరో’, ‘ఆదివాసీ స్కూల్‌ ఠీక్‌ కరో’ పేరుతో సీజేపీ పలు రాష్ట్రాల్లో పాఠశాలలను తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఈ కార్యక్రమంపై మరో ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీజేపీ నిరసనలు, అల్టిమేటాలు, రాజీనామా డిమాండ్లతో దూకుడుగా వ్యవహరిస్తుండగా.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం మెతక ధోరణికే పరిమితమవుతోందట. దీంతో ఇదేనా కాక్రోచ్‌ల ఫెయిర్‌నెస్‌? అనే ప్రశ్న పుట్టుకొచ్చింది.

జూన్‌ 6న ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ప్రారంభమైన సీజేపీ ఆందోళన.. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో సాగింది. పరీక్షల పేపర్‌ లీకులు, నియామకాల్లో అవకతవకలు వంటి అంశాలపై 37 రోజులపాటు ఉద్యమం జరిగింది. జూలై 25న ప్రధాన్‌ రాజీనామా చేసిన తర్వాత సీజేపీ విజయోత్సవ సంబురాలు చేసుకుంది. అయితే ఆ వెంటనే దాని దృష్టి ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లింది. ఆగస్టు 15న మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, భవనాల పరిస్థితి వంటి అంశాలను పరిశీలిస్తూ.. సమస్యలను వీడియోల రూపంలో బయటకు తీసుకొస్తోంది. ఆపై ఆదివాసీ స్కూళ్లపైనా ఈ క్యాంపెయిన్‌ను ఉధృతం చేసింది. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దూకుడు..
స్కూల్‌ ఠీక్‌ కరో కోసం మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఉత్తరప్రదేశ్‌లో పరీక్షల అక్రమాలపై నిరసనల్లో పాల్గొన్న ఆ సంస్థ.. తర్వాత నోయిడాలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసింది. రాజస్థాన్‌లో పాఠశాలల పరిస్థితిపై తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర తన స్వరాష్ట్రం కావడంతో సీజేపీ నేత అభిజీత్‌ దీప్కే స్వయంగా రంగంలోకి దిగి ఉద్యమించారు. సెప్టెంబర్‌ 17న గడ్చిరోలిలో ఆదివాసీ పాఠశాలల కోసం ప్రత్యేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అంతేకాదు తమ పోరాటం వల్లే హర్యానా ప్రభుత్వంలో పాఠశాలల రిపేర్‌ల కోసం కదలిక వచ్చిందని గర్వంగా ప్రకటించుకుంది. 

ప్రతిపక్ష రాష్ట్రాల్లో మరోలా!
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీజేపీ నిరసనలు, అల్టిమేటాలు, రాజీనామా డిమాండ్లతో ఒత్తిడి పెంచగా.. బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం మరోలా సాగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌, కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలోనూ సీజేపీ బృందాలు పాఠశాలలను తనిఖీ చేశాయి. పంజాబ్‌లో సౌరవ్‌ దాస్‌ నేతృత్వంలోని బృందం లూధియానాలో మూడు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించింది. ‘స్కూల్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’లోని స్విమ్మింగ్‌ పూల్‌, ఏఐ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ వంటి సౌకర్యాలను ప్రశంసించడంతో పాటు కొన్ని లోపాలను గుర్తించింది.

ఈ విషయాలను విద్యాశాఖ మంత్రి హర్జోత్‌ సింగ్‌ బైన్స్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇక కర్ణాటకలో సీజేపీ బృందం బెంగళూరు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, భవనాల భద్రత, పారిశుధ్య సమస్యలను గుర్తించింది. ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ను రాష్ట్రంలోని 31 జిల్లాలకు విస్తరించనున్నట్లు ప్రకటించి, విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పతో సమావేశమైంది.

కాంగ్రెస్‌ ట్విస్ట్‌
అయితే సీజేపీ ఉద్యమంపై కాంగ్రస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమ పాలిత రాష్ట్రాల్లో నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వడంపై కౌంటర్‌ ఇచ్చింది. బీజేపీయేతర రాష్ట్రాల్లో చేసినట్టే.. మిగతా రాష్ట్రాల్లోనూ పక్షపాతం లేకుండా అడిటింగ్‌ చేపట్టాలని సీజేపీకి సూచిస్తోంది. అదే దృష్టితో, అదే ప్రశ్నలతో, అదే ధైర్యంతో తనిఖీలు చేయండి అంటూ సచిన్‌ పైలట్‌ చురకలు అంటించారు. అయితే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఈ విమర్శలను తోసిపుచ్చారు. పంజాబ్‌, కర్ణాటక, జార్ఖండ్‌లోనూ తమ బృందాలు పర్యటించి పాఠశాలల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాయని చెప్పారు.

అందుకే ఇప్పుడు చర్చ సీజేపీ ఎక్కడికి వెళ్లిందన్నదానిపై కాదు.. ఎక్కడ ఎంత ఒత్తిడి తీసుకొచ్చిందన్నదే*. రాష్ట్రాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా వైఖరి మారిందా? లేక రాజకీయ తేడా ప్రభావం చూపిందా? అన్న ప్రశ్నలు మాత్రం కొనసాగుతున్నాయి. దీనికి సమాధానం సీజేపీ రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాల తీరు మరింత స్పష్టత ఇవ్వొచ్చు. ఇదిలా ఉంటే.. పాఠశాలల్లోని సమస్యలు బయటకు రావడం, వాటిపై ప్రభుత్వాలు స్పందించడం మాత్రం ఈ క్యాంపెయిన్‌ ద్వారా కనిపిస్తున్న పరిణామం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement