ఇరాన్‌ బిగ్‌ ఆఫర్‌.. నో చెప్పి షాకిచ్చిన ట్రంప్‌! | Report Says Trump Rejects Iran 7-day Peace Proposal Amid Ongoing Tensions, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ బిగ్‌ ఆఫర్‌.. నో చెప్పి షాకిచ్చిన ట్రంప్‌!

Sep 26 2026 8:01 AM | Updated on Sep 26 2026 10:10 AM

Report Says Trump rejects Iran 7-day peace proposal

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధానికి తెరదించేలా ఇరాన్‌ చేసిన కీలక ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించలేదని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది. ఏడు రోజుల్లో హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడం, కాల్పుల విరమణకు వెళ్లడం వంటి ప్రతిపాదనను ఇరాన్‌ అమెరికా ముందు ఉంచగా.. ట్రంప్‌ దాన్ని తిరస్కరించినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ కథనం వెల్లడించింది.

ఇదే సమయంలో నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మళ్లీ బాంబు దాడులు ప్రారంభించే అవకాశం ఉందని ట్రంప్‌ తన సన్నిహితులకు చెప్పినట్లు సదరు కథనంలో నివేదించింది. అయితే ఇరాన్‌ ప్రతిపాదనపై అమెరికా నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదని పేర్కొంది.

ఇరాన్‌ ప్రతిపాదన ఏంటి?
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఖతార్‌ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు తమ ప్రతిపాదనను పంపినట్లు తెలిపారు. అమెరికా కొన్ని షరతులను అంగీకరిస్తే ఏడు రోజుల్లో హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచి, సాధారణ నౌకా రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇరాన్‌ షరతుల్లో ప్రధానంగా అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్‌ చమురు ఎగుమతులపై ఆంక్షలను సడలించడం, మధ్యప్రాచ్యవ్యాప్తంగా కాల్పుల విరమణ పాటించడం ఉన్నాయి. లెబనాన్‌లోనూ శత్రుత్వాన్ని నిలిపివేయాలని ఇరాన్‌ కోరింది. దీనికి ప్రతిగా హార్ముజ్‌ను తెరిచి, అమెరికాతో అణు కార్యక్రమంపై చర్చలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు.

ట్రంప్‌ వైఖరి ఏంటి?
ఇరాన్‌ ప్రతిపాదనతో దౌత్యపరమైన చర్చలకు అవకాశం కనిపించినప్పటికీ, ట్రంప్‌ మాత్రం ఒప్పందంపై అనుమానంతో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ కథనం పేర్కొంది. ఇరాన్‌ తన డిమాండ్లను పూర్తిగా అమలు చేస్తుందన్న నమ్మకం ట్రంప్‌కు లేదని అమెరికా అధికారులను ఉటంకించింది. మరోవైపు అమెరికా, ఇరాన్‌ మధ్య మధ్యవర్తుల ద్వారా సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని ఓ అమెరికా అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. అందువల్ల ప్రస్తుతం పరిస్థితి ఒకవైపు ఇరాన్‌ ఏడు రోజుల్లో హార్ముజ్‌ను తెరిచే ప్రతిపాదన.. మరోవైపు ట్రంప్‌ దానిపై విముఖతగా కనిపిస్తోంది. ఇరాన్‌ మాత్రం అమెరికా అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తోంది.

ఇదీ చదవండి: భారత్‌కు పాక్‌ ప్రధాని సంచలన హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement