ఘోర విమాన ప్రమాదంతో ఆఫ్రికా దేశమైన కాంగోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సైనిక అధికారులతో కూడిన విమానం కుప్పకూలి.. అందులోని మొత్తం 14 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులు ఉండడం గమనార్హం. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
కాంగో సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం.. సైనిక ప్రతినిధులతో కూడిన విమానం నైరుతి ప్రాంతంలోని కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు తిరుగు ప్రయాణమైంది. ఉన్నట్లుండి నియంత్రణ కోల్పోయిన విమానం కేంజ్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. ఈ ప్రమాదంలో కాంగో మిలటరీ కోర్టు చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా మృతి చెందినట్లు సైన్యం తెలిపింది. వీరితో పాటు ప్రతినిధి బృందానికి చెందిన సభ్యులు, విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
కాంగో సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంజె ఈ ప్రమాదంపై ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు జనరల్స్‌తో పాటు మరో 12 మంది ప్రతినిధులు, సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలిపారు.
OVER DOZEN DEAD after PLANE CRASH in DR CONGO
AMONG 14 KILLED: Head of military court, and auditor general of armed forces
FIERY WRECKAGE and DEBRIS strewn ACROSS CRASH SITE pic.twitter.com/Hw36wJhoG0— RT (@RT_com) September 25, 2026
సాంకేతిక లోపమే కారణమా?
విమానం కిక్విట్ నుంచి కిన్షాసాకు వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు సైన్యం ప్రకటించింది. కాంగో సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ ట్రైఫోన్ కిన్-కియే ములుంబా కూడా విమాన ప్రమాదానికి కారణం ప్రస్తుతానికి తెలియదని తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తిరుగుబాట్లతో సతమతమవుతూ..
కాంగోలో చాలాకాలంగా భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతంలో పలు తిరుగుబాటు గ్రూపులతో సైన్యం పోరాడుతోంది. వీటిలో రువాండా మద్దతు ఉన్న ఎం23 తిరుగుబాటు సంస్థ కూడా ఉంది. గత ఏడాది ఈ గ్రూపులు వేగంగా దాడులు నిర్వహించి కీలక నగరాలను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో కాంగోలో ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి.
ఇదీ చదవండి: చంద్రుడిపై చైనా తొలి అడుగు.. జరిగేది ఇదేనంట!


