చంద్రుడిపై మరో అంతరిక్ష పోరుకు తెరలేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనా మధ్య పోటీ ఇప్పుడు భూకక్ష్య దాటి ఏకంగా చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరింది. అక్కడి విలువైన నీటి మంచు నిల్వలున్న ప్రాంతాలను ముందుగా ఎవరు చేజిక్కించుకుంటారన్నది కీలకంగా మారింది. చైనా ముందుగా అడుగుపెడితే.. కీలక ప్రాంతాల్లో అమెరికాకు ప్రవేశం లేకుండా చేసే పరిస్థితి రావొచ్చని నాసా చీఫ్ జారెడ్ ఐజాక్‌మన్ హెచ్చరించారు. హ్యూస్టన్‌లో జరిగిన ‘ఆఫ్ వరల్డ్’ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనాకు చెందిన చాంగ్‌ఈ-7 మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువంలోని షాకిల్టన్ క్రేటర్‌ను లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ఎప్పటికీ సూర్యకాంతి పడని ప్రాంతాలు ఉన్నాయి. వీటిని ‘కోల్డ్ ట్రాప్స్’గా పిలుస్తారు. అక్కడ నీరు మంచు రూపంలో ఉండటంతో పాటు భవిష్యత్ చంద్ర పరిశోధనలకు ఉపయోగపడే ఇతర పదార్థాలు కూడా పేరుకుపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అయితే చైనా గత నెలలో చాంగ్‌ఈ-7 మిషన్‌ను వాయిదా వేసింది. ఈ మిషన్‌లో చంద్రుడి ఉపరితలంపై గతంలో లభించని స్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, మొబైల్ హాపర్ అనే నాలుగు రకాల రోబోటిక్ వాహనాలను ఉపయోగించనున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో మేం లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాన్నే వారు కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కొన్ని వారాల క్రితం చాంగ్‌ఈ-7 వాయిదా పడటం వల్ల మనం ఒక పెద్ద సమస్య నుంచి తప్పించుకున్నట్టే. ఆ మిషన్ షాకిల్టన్ క్రేటర్‌కు వెళ్లాల్సి ఉందని ఐజాక్‌మన్ పేర్కొన్నారు.
చంద్రుడిపై చైనా ‘ఎక్స్‌క్లూజన్ జోన్లు’ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ఆందోళనలు అమెరికా అధికారుల్లో పెరుగుతున్నాయి. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే వాహనాల చుట్టూ భద్రతా నిబంధనల ప్రకారం సాధారణంగా 1 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రవేశ నిషేధ ప్రాంతం ఉండాల్సి ఉంటుంది. దీంతో ముందుగా అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్న దేశం.. ప్రత్యర్థి దేశాల ప్రవేశాన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడొచ్చని అమెరికా భావిస్తోంది.
చాంగ్‌ఈ-7లో రోవర్లతో పాటు హాపర్ డ్రోన్లు కూడా ఉంటాయని ఐజాక్‌మన్ తెలిపారు. చంద్రుడిపై ఉన్న నీటి మంచుతో నేరుగా పని చేయడం.. దాని గురించి అధ్యయనం చేయడం చైనా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎవరు ముందుగా చంద్రుడిపైకి దిగుతారనే విషయంలో వెనుకబడితే.. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందంటూ ఐజాక్‌మన్ వ్యాఖ్యానించారు. చైనా చాంగ్‌ఈ-7 మిషన్‌ను వాయిదా వేయడంతో చంద్రుడి దక్షిణ ధ్రువానికి ముందుగా చేరుకునే అవకాశం ప్రస్తుతం నాసాకు కూడా లభించింది. బ్లూ ఆరిజిన్‌కు చెందిన ‘బ్లూ మూన్ మార్క్-1’ వాహనాన్ని తొలిసారిగా 2027లో ప్రయోగించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఈ భారీ ల్యాండర్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువానికి నాసాకు చెందిన రెండు ప్రోబ్స్‌ను పంపే అవకాశం ఉంది.
చంద్ర పరిశోధనలో అగ్రశక్తిగా ఎదగడానికి చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. అంతరిక్ష రంగంలో చైనా పురోగతిని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‘చిరకాల కల’గా అభివర్ణించారు. 1972లో అమెరికా తర్వాత చంద్రుడిపై మనుషులను పంపే రెండో దేశంగా నిలవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపే లక్ష్యం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం


