వైట్‌హౌస్‌ డిన్నర్‌లో మనవాళ్లు! వీళ్లే.. | Trump-Xi White House Dinner Indian-Origin Guests Satya Nadella Sundar Pichai | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ డిన్నర్‌లో మనవాళ్లు! వీళ్లే..

Sep 25 2026 4:15 PM | Updated on Sep 25 2026 4:46 PM

Trump-Xi White House Dinner Indian-Origin Guests Satya Nadella Sundar Pichai

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు గురువారం (సెప్టెంబర్‌ 24) వైట్‌హౌస్‌లో ఘన విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌ ఈస్ట్‌ రూమ్‌లో జరిగిన ఈ స్టేట్‌ డిన్నర్‌కు జిన్‌పింగ్‌ తన భార్య పెంగ్‌ లియువాన్‌తో కలిసి హాజరయ్యారు. ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి అమెరికా ప్రభుత్వంలోని కీలక అధికారులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, చట్టసభ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, టెక్‌ దిగ్గజాలు కలిపి 134 మంది అతిథులు ఆహ్వానితులుగా ఉన్నారు.

ఈ విందులో అమెరికా టెక్నాలజీ రంగానికి చెందిన ప్రముఖుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌, యాపిల్‌ బోర్డు చైర్మన్‌ టిమ్‌ కుక్‌, ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌, ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, ఏఎండీ సీఈవో లిసా సూ తదితరులు పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

విందులో భారతీయ మూలాలున్న ఐదుగురు

వైట్‌హౌస్‌ విడుదల చేసిన అతిథుల జాబితా ప్రకారం.. భారతీయ మూలాలున్న ఐదుగురు ప్రముఖులకు ఈ విందులో చోటు దక్కింది. వారిలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి, సెకండ్‌ లేడీ ఉషా వాన్స్‌ ఉన్నారు. టెక్నాలజీ రంగం నుంచి మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌, సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, మైక్రాన్‌ టెక్నాలజీ ఛైర్మన్‌, ప్రెసిడెంట్‌, సీఈవో సంజయ్‌ మెహ్రోత్రా హాజరయ్యారు. సంజయ్‌ మెహ్రోత్రా భార్య సంగీతా మెహ్రోత్రా కూడా అతిథుల జాబితాలో ఉన్నారు.

అయితే ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ అతిథుల జాబితాలో లేరు. భారతీయ మూలాలున్న ప్రముఖులు మాత్రం అమెరికా రాజకీయ, వ్యాపార, సాంకేతిక రంగాల్లో తమ స్థానానికి అనుగుణంగా ఆహ్వానం అందుకున్నారు.

ఒకే వేదికపై టెక్‌, ఫైనాన్స్‌ దిగ్గజాలు

విందులో టెక్నాలజీ రంగంతో పాటు అమెరికా ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. జేపీ మోర్గాన్‌ చేజ్‌ సీఈవో జేమీ డైమన్‌, బ్లాక్‌రాక్‌ సీఈవో లారీ ఫింక్‌, బ్లాక్‌స్టోన్‌ అధినేత స్టీఫెన్‌ స్క్వార్జ్‌మన్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ సీఈవో డేవిడ్‌ సోలమన్‌, సిటీగ్రూప్‌ సీఈవో జేన్‌ ఫ్రేజర్‌, మాస్టర్‌కార్డ్‌ సీఈవో మైఖేల్‌ మైబాక్‌ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌, న్యాయమూర్తులు అమీ కోనీ బారెట్‌, బ్రెట్‌ కవనాగ్‌ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు.

ఇదీ చదవండి: ఆస్తులు ఉచితమే.. అప్పులూ ఉచితమే!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement