కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 మెట్రిక్‌ టన్నుల చెత్త | Kedarnath Waste Crisis 50 metric Tonnes of Garbage Generated in 5 Months | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 మెట్రిక్‌ టన్నుల చెత్త

Sep 25 2026 2:22 PM | Updated on Sep 25 2026 3:00 PM

Kedarnath Waste Crisis 50 metric Tonnes of Garbage Generated in 5 Months

ప్రసిద్ధ హిమాలయ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో భక్తుల రద్దీతో పాటు వ్యర్థాల వినియోగం తీవ్ర స్థాయికి చేరింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా కేదార్‌నాథ్ నగర్ పంచాయతీ వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల వ్యవధిలోనే అక్కడ ఏకంగా 50.30 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇది గత మూడు సంవత్సరాల్లో నమోదైన మొత్తం వార్షిక వ్యర్థాల కంటే అత్యధికం కావడం గమనార్హం.

గత మూడేళ్ల గణాంకాలు ఇలా..

  • 2023: 32.58 మెట్రిక్ టన్నులు

  • 2024: 26.10 మెట్రిక్ టన్నులు

  • 2025: 21.40 మెట్రిక్ టన్నులు

  • 2026 (ఏప్రిల్ - ఆగస్టు): 50.30 మెట్రిక్ టన్నులు

ఈ ఏడాది వ్యర్థాల పరిమాణం 2023తో పోలిస్తే 54 శాతం, 2024తో పోలిస్తే 93 శాతం, అలాగే గత ఏడాది (2025)తో పోలిస్తే 135 శాతానికి పైగా (సుమారు 2.5 రెట్లు) పెరిగింది. ఈ యాత్రా సీజన్‌లో మే నెలలోనే అత్యధికంగా 16.3 టన్నుల చెత్త సేకరించారు. ఇప్పటివరకు దాదాపు 15.42 లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు, ల్యాండ్‌ఫిల్స్ పరిస్థితి

ఈ ఐదు నెలల్లో సుమారు 20 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు రాగా అందులో 18.5 టన్నులను (92.5%) ప్రాసెస్ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మిశ్రమ వ్యర్థాల పారవేతకు స్థానిక యంత్రాంగం ల్యాండ్‌ఫిల్‌లపై ఆధారపడుతోంది. గత ఐదేళ్లలో కేదార్‌నాథ్‌లో నాలుగు ల్యాండ్‌ఫిల్‌లను నిర్మించారు. మొత్తం 30,000 చదరపు అడుగుల ల్యాండ్‌ఫిల్ విస్తీర్ణంలో ప్రస్తుతం 28,000 చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని నగర్ పంచాయతీ స్పష్టం చేసింది.

పర్యావరణవేత్తల ఆందోళన

చోరాబారీ గ్లేషియర్ కింద మందాకిని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న కేదార్‌నాథ్ అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. ఇక్కడ అధికంగా ల్యాండ్‌ఫిల్‌లను ఉపయోగించడం వల్ల భూగర్భ జలాలు, నదీ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం భక్తుల సంఖ్యనే కాకుండా క్షేత్ర స్థాయి వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని యాత్రా నిర్వహణ విధానాలను పునసమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement