పాకిస్థాన్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌కు “ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నారు. ఈ రోజు శుక్రవారం గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లో యూపీ ట్రెడిషన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో నాలుగో ఎడిషన్‌ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ “ నేడు ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌కు కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మార్పుకు ఇది ప్రధాన సూచిక” అని అన్నారు. అదేవిధంగా అమేథీలో తయారవుతున్న ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు కూడా నక్సలైట్లు, ఉగ్రవాదులకు కునుకు లేకుండా చేస్తున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ విస్తరిస్తోందని చెప్పడానికి బ్రహ్మోస్ క్షిపణులు, ఏకే-203 రైఫిళ్ల తయారీ ఉదాహరణలని ఆయన స్పష్టం చేశారు.
లక్నోలోని బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ను ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా 2025 మేలో ప్రారంభించారు. సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌కు సంబంధించిన అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, పరీక్షల పనులు ఈ కేంద్రంలో జరుగుతున్నాయి. అక్కడ తయారైన తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను 2025 అక్టోబర్‌లో అధికారికంగా పంపించారు.ఈ కేంద్రాన్ని సుమారు ₹300 కోట్ల పెట్టుబడితో, దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
‘భారత్ వృద్ధి కొనసాగుతుంది
ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ తన ఆర్థిక వృద్ధిని కొనసాగించిందని అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, వాణిజ్య విధానాలు ఎగుమతి అవకాశాలను విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. “భారత్ పురోగతిని చూడలేని వారు దానిని భరించలేరని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) కుదుర్చుకుందని ఆయన తెలిపారు.
ఈ ఒప్పందాల వల్ల భారత పరిశ్రమలకు ఎగుమతి అవకాశాలు గణనీయంగా పెరిగాయని, వివిధ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే భారత్ తన ఆర్థిక వృద్ధిని కొనసాగించిందని షా అన్నారు.డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లోకి వస్తున్న పెట్టుబడులు కేవలం ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా రక్షణ ఉత్పత్తుల అభివృద్ధికి దోహదపడుతున్నాయని ఆయన చెప్పారు.
యూపీలో మాఫియా పాలన
2017లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిలో పెద్ద మార్పు వచ్చిందని అమిత్ షా అన్నారు. “ఒకప్పుడు యూపీలో మాఫియా పాలన ఉండేది. 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యోగి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మాఫియాను విజయవంతంగా నిర్మూలించింది. దీనివల్ల పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది” అని ఆయన అన్నారు.


