న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తనను 'ఎన్‌కౌంటర్' చేసి చంపేస్తారేమోనంటూ ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.
గతేడాది సెప్టెంబర్ 24న లడాక్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా మరియు ఆరవ షెడ్యూల్ రక్షణల కోసం చేపట్టిన నిరసనల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు.
నాటి ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ, పోలీసుల కాల్పులపై న్యాయ విచారణ జరిపి ఆ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. ఒకవేళ నివేదికను విడుదల చేయకపోతే, పోలీసుల కాల్పులపై విచారణ జరపడానికి స్వతంత్రంగా "ప్రజల ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.
తన ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరికలు అందాయని, ఏ పరిణామం ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. "వారు నన్ను ఇప్పటికే జైలులో పెట్టారు. ఇప్పుడు నన్ను ఎక్కడైనా ఎన్‌కౌంటర్ చేసే అవకాశం కూడా ఉంది. 'మిమ్మల్ని ఎన్‌కౌంటర్ చేస్తారు' అని నాతో అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే జరగనివ్వండి అప్పుడైనా దేశం మేల్కొంటుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమిత్ షాపై విమర్శలు
లడాక్ ఆందోళనలో మృతి చెందిన ఘటనకు అమిత్ షానే రాజకీయంగా బాధ్యత వహించాలని వాంగ్‌చుక్ అన్నారు.నేను లడాక్ నుండి ఈరోజు చెబుతున్నాను అమిత్ షా రాజీనామా చేయాలి. లడాక్‌లో జరిగిన దానికి ఆయన బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. స్థానిక యువతపై భద్రతా సిబ్బంది ఏకే 47 వంటి ఆటోమేటిక్ ఆయుధాలను ఉపయోగించారని, ఆ తర్వాత ఆ యువకులను దేశద్రోహులుగా ముద్రవేశారని ఆయన ఆరోపించారు.
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమిత్ షా రాజీనామాను కోరడాన్ని వాంగ్‌చుక్ ప్రస్తావించారు. తాను ఆ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నానని, అయితే లడాక్ విషయంలో రాహుల్ గాంధీ మౌనం వహించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లడాక్‌కు ఒక వైపు చైనా, మరో వైపు భారత్ ఉన్నాయి. భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందని, మనం తలెత్తుకుని బతకగలమని నమ్మి లడాక్ భారత్‌ను ఎంచుకుంది. కానీ ఈరోజు లడాక్‌పై ఎలాంటి అణచివేత సాగుతోందంటే, నా దృష్టిలో కనీసం చైనా కూడా టిబెట్‌పై ఇలాంటి చర్యలకు పాల్పడటం లేదు అని ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.


