పట్నా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ మైనర్ బాలికలపై లైంగిక వేదింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ ఘటనలో ప్రధాన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నందన్ యాదవ్ మద్వా కొండ ప్రాంత సమీపంలో దాక్కున్నాడు. ఆ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడిని చుట్టుముట్టి పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను పారిపోవడానికి యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతని ఎడమకాలుపై కాల్పులు జరిపారు.
అయితే బాధితులకు సంబంధించి వైరల్ అయిన వీడియోలో సదరు యువకుడు ఎర్ర కండువా ధరించిన యువకుడిగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇదివరకూ ఆరుగురిని అరెస్టు చేశారు.నిందితులలో ముగ్గురి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండగా, మిగిలిన ముగ్గురు మైనర్లు అని తెలిపారు.
అసలేం జరిగింది?
జముయీ జిల్లా కేంద్రానికి చెందిన ఒక టీనేజీ అమ్మాయి, టీనేజీ అబ్బాయి ఒకే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు. సెప్టెంబర్ 19వ తేదీన కోచింగ్ సెంటర్‌లో క్లాసుకు వెళ్లి అటు నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మడ్వా పహాడ్‌కు వెళ్లి తిరిగొస్తుండగా వీళ్లను గమనించిన కొందరు ఆగంతకులు మార్గమధ్యంలో వీళ్లను లఖీసరాయ్ రోడ్డుపై 7 గంటల సమయంలో అడ్డగించి దారుణంగా వేధించారు. వదిలేయాలని అమ్మాయి కాళ్లావేళ్లా పడిన కనికరం చూపలేదు. అమ్మాయిపై లైంగికదాడికి యత్నించారు. ఇదంతా ఒక ఆగంతకుడు తన మొబైల్‌లో చిత్రీకరించాడు.
టీనేజీ అబ్బాయిని కొట్టారు. పారిపోయేందుకు ప్రయత్నించిన టీనేజర్లను వెంటబడిమరీ ఆగంతకులు వేధించారు. అల్లరిమూకలో ఒకడు అమ్మాయిని గట్టిగా అదిమిపట్టి ఎత్తుకెళ్లే ప్రయత్నంచేశాడు. ఈ దారుణోదంతం తాలూకు వీడియో ఆదివారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది.ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఆ కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది చదవండి: బిహార్‌లో దుశ్శాసన పర్వం


