ఆన్‌లైన్‌లో చిన్నారుల భద్రతను బలోపేతం చేసే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్‌ఫారమ్‌ల్లో కనిపించే చిన్నారుల లైంగిక వేధింపుల సమాచారం(సీఎస్‌ఏఎం)ను ఇకపై నేరుగా భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రానికి (I4C) అందజేయడానికి అంగీకరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే I4Cకి ఈ డేటాను పంపడం ద్వారా భారత చట్ట అమలు సంస్థలకు వేగంగా సమాచారం అందుతుంది.
పాత పద్ధతికి స్వస్తి.. నేరుగా నివేదన
ఇంతకాలం గూగుల్, మెటా వంటి గ్లోబల్ టెక్ సంస్థలు భారతదేశంలో గుర్తించిన సీఎన్‌ఏఎం కంటెంట్‌ను ముందుగా అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ)కి పంపేవి. అక్కడ పరిశీలించిన అనంతరం ఆ నివేదికలు భారత ఏజెన్సీలకు చేరేవి. ఈ ప్రక్రియ వల్ల విలువైన సమయం వృథా అవుతోందని, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ రక్షణ కల్పించడం ఆలస్యమవుతోందని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం టెక్ కంపెనీలపై ఒత్తిడి పెంచింది. ఇటీవల మెటా సైతం ఇదే నిర్ణయం తీసుకోగా తాజాగా గూగుల్ కూడా భారత విజ్ఞప్తికి నిలబడింది.
ఒత్తిడి పెంచిన బీబీసీ దర్యాప్తు
ఇటీవల బీబీసీ ఐ(BBC Eye) చేసిన పరిశోధనలో ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని శోధన పదాల (సెర్చ్ టర్మ్స్) ద్వారా చిన్నారుల లైంగిక ప్రసార ఛానెళ్లకు దారితీసే ప్రకటనలు కనిపిస్తున్నట్లు వెల్లడైంది. ఈ తీవ్ర పరిణామంపై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు. ఈ ఉదంతం తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలపై తక్షణ చర్యల కోసం కేంద్రం నుంచి ఒత్తిడి పెరిగింది.
యూట్యూబ్‌తో పాటు మెటా ప్లాట్‌ఫారమ్‌లకు అత్యధిక వినియోగదారులు ఉన్న అతిపెద్ద మార్కెట్ భారతదేశమే. ఐటీ చట్టం సెక్షన్ 67B ప్రకారం చట్టపరమైన బాధ్యతలను నెరవేరుస్తూ కాలయాపన లేకుండా నేరస్థులను పట్టుకోవడానికి ఈ ప్రత్యక్ష రిపోర్ట్ విధానం దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం కొనాలా? ఆగాలా?.. ఈరోజు కొత్త రేట్లు ఇవే..


