యవ్వనంలో ఉన్నప్పుడు ఒకే దారిలో నడిచిన ఇద్దరు వ్యక్తులు.. ఒకరు ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరితే, మరొకరు పూర్తిగా భిన్నమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. వీరిద్దరూ ఎదురుపడినప్పుడు జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి ఈ ఘటన గతంలోనే జరిగినప్పటికీ ఇటీవల కృష్ణాష్టమి జరగడంతో ఇది ఇళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ 1993లో ఐఐటీ పూర్తి చేశారు. సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదవగా.. గౌరంగ దాస్ ఐఐటీ బాంబేలో చదివారు. ఇద్దరూ ఒకే సంవత్సరం ఐఐటీలో పట్టభద్రులైనా.. తర్వాత వారి జీవిత ప్రయాణాలు పూర్తిగా భిన్నంగా సాగాయి.
సుందర్ పిచాయ్ 1993లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మెటీరియల్స్ సైన్స్, ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ పాఠశాలలో ఎంబీఏ పూర్తి చేశారు. 2004లో గూగుల్‌లో చేరిన పిచాయ్.. గూగుల్ క్రోమ్, క్రోమ్ ఓఎస్ వంటి ఉత్పత్తులపై పనిచేశారు. 2015 ఆగస్టులో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబరులో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా నియమితుడయ్యారు.
మరోవైపు గౌరంగ దాస్ ఐఐటీ బాంబేలో చదువు పూర్తి చేసిన తర్వాత భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కార్పొరేట్ జీవితాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు. అనంతరం సన్యాసిగా మారి ఇస్కాన్‌లో సీనియర్ నాయకుడిగా ఎదిగారు. ఆధ్యాత్మిక విద్య, సామాజిక కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పనిచేస్తున్నారు.
ఏళ్ల తర్వాత సుందర్ పిచాయ్, గౌరంగ దాస్ 2019లో ఆకాశ్ అంబానీ వివాహ వేడుకలో కలుసుకున్నట్లు దాస్ తెలిపారు. ఆ సమావేశం గురించి 2025 జూన్‌లో లండన్‌లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరమ్ కార్యక్రమంలో గౌరంగ దాస్ మాట్లాడారు. పిచాయ్ తనను చూసి ‘‘నాకంటే నువ్వు చిన్నవాడిలా కనిపిస్తున్నావు’’ అని చెప్పినట్లు దాస్ గుర్తుచేసుకున్నారు.
దానికి గౌరంగ దాస్ స్పందిస్తూ.. ‘‘మీ వ్యవహారం అంతా గూగుల్‌తో ఉంటుంది.. అది ఒత్తిడిని సృష్టిస్తుంది. నా వ్యవహారం అంతా దేవుడితో ఉంటుంది.. ఆయన ఒత్తిడిని తొలగిస్తాడు’’ అని చెప్పినట్లు తెలిపారు. వారి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇద్దరి జీవన మార్గాల మధ్య ఉన్న తేడాను ప్రతిబింబించింది.


