ఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అతిథ్యమివ్వడంతో ప్రపంచ దేశాధినేతలు భారత్‌కు తరలివచ్చారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి భారత్‌పై పడింది. ఈ నేపథ్యంలో ఈ అంతర్జాతీయ శిఖరాగ్రసదస్సుకు ఆతిథ్యమిస్తున్న భరతమండపం ప్రత్యేకతలు ఏంటి..దానిని ఎప్పుడు నిర్మించారు. అనే వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రపంచ దేశాల అగ్రనేతలు హాజరవుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు భారత్ రాజధాని న్యూఢిల్లీ వేదికైంది. ఈ వార్షిక సదస్సు కోసం దేశ నడిబొడ్డున ఉన్న అత్యాధునిక 'భారత్ మండపం' సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే ఇది వరకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సహా పలువురు ప్రపంచ స్థాయి నాయకులు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.
భరత మండపం నిర్మాణం
ప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో 123 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్ల వ్యయంతో ఈ వేదికను నిర్మించారు. 2023లో ప్రారంభమైన ఈ సముదాయం నేడు భారతదేశ ఆతిథ్య సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. 12వ శతాబ్దపు 'అనుభవ మండపం' స్ఫూర్తితో దీనికి 'భారత్ మండపం' అని నామకరణం చేశారు.
నటరాజ విగ్రహం ప్రత్యేకత
ఈ సముదాయంలో ఏర్పాటు చేసిన 27 అడుగుల ఎత్తు, 18 టన్నుల బరువు కలిగిన భారీ నటరాజ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అష్టధాతువులతో తమిళనాడు శిల్పులు దీనిని అద్భుతంగా మలిచారు. ప్రధాన సమావేశ మందిరం భవనం 'శంఖం' ఆకారంలో రూపొందించబడింది. ఇది చేతన శక్తిని, శుభారంభాన్ని సూచిస్తుంది. సూర్య శక్తి, జీరో నుంచి ఇస్రో సాధించిన ప్రయాణం, పంచ మహాభూతాల ప్రాముఖ్యతను తెలిపేలా దీని లోపలి బయటి డిజైన్లు భారతీయ నాగరికతను ప్రతిబింబిస్తున్నాయి.
భారత్ మండపంలో వివిధ హాళ్లు
150 దేశాల ప్రతినిధులకు సరిపడే సామర్థ్యం ఉన్న ఈ హాలులో కీలకమైన ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమం ఇక్కడే జరిగింది. డ్రోన్ టెక్నాలజీతో పాటు భారత్ సాధించిన నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు.
హాల్ నెం. 14: బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనే ఈ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాపార వర్గాలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
హాల్ నెం. 5: ప్రపంచ వ్యాప్తంగా విచ్చేసిన సుమారు 1,200 నుంచి 1,400 మంది జర్నలిస్టుల కోసం ఇంటర్నేషనల్ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాలు, ఉగ్రవాద నిరోధక విధానాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సవాళ్లపై ప్రపంచ నేతలు చర్చిస్తున్నారు. అలాగే బ్రిక్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విధానాలను చర్చించనున్నారు.
కట్టుదిట్టమైన భద్రత
భారత్ మండపంలో భద్రతా వ్యవస్థ అత్యంత అత్యాధునిక సాంకేతికతతో, అభేద్యమైన కోటను తలపించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది. అంతర్జాతీయ సదస్సులు జరిగే సమయంలో ఇక్కడ శత్రు దుర్భేద్యమైన మల్టీ-లేయర్డ్ (బహుళ అంచెల) భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంగణంలోని ప్రధాన సెక్యూరిటీ ప్రత్యేకతలు భారత్ మండపం చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల మేర బహుళ అంచెల భద్రతా వలయం ఉంటుంది. ఔటర్ రింగ్‌లో ఢిల్లీ పోలీస్ మరియు పారామిలటరీ బలగాలు కాపలా ఉంటే, అంతర్గత కోర్ జోన్‌లో (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోలతో పాటు ప్రత్యేక దళాలు మోహరిస్తాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నైజేషన్: ఇక్కడి నిఘా వ్యవస్థలో AI సాంకేతికతను ఉపయోగిస్తారు. హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనుసంధానించబడి ఉంటుంది. ఇది అనుమానాస్పద వ్యక్తులను లేదా నేరస్థుల డేటాబేస్‌లో ఉన్న ముఖాలను క్రౌడ్‌లో సైతం క్షణాల్లో గుర్తించి అలర్ట్ చేస్తుంది.
డ్రోన్ సిస్టమ్స్ ఆకాశ మార్గం నుండి ఎలాంటి ముప్పు రాకుండా భవనం చుట్టూ అత్యాధునిక యాంటీ-డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్స్ అప్రమత్తంగా ఉంటాయి. అనుమతి లేని ఏ డ్రోన్ లేదా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అయినా ఈ పరిధిలోకి వస్తే వాటిని జామ్ చేయడం లేదా కూల్చివేయడం జరుగుతుంది. ఇలా భరతమండపంకు ఆధునాతనమైన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.


