అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' గురువారం ఎపిసోడ్‌లో, ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన రోల్‌ఓవర్ కంటెస్టెంట్ 27 ఏళ్ల ఉద్దేశ్య సచన్ రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో విఫలమై, రూ. 12.5 లక్షల నగదు బహుమతితో గేమ్‌నుంచి నిష్క్రమించారు. అయితే ఈ ఎపిసోడ్ సందర్భంగా ఉద్దేశ్య వెల్లడించిన వివరాలు నెట్టింట విశేషంగా నిలిచాయి.
కాన్పూర్‌లో పేద పిల్లల కోసం ఒక పాఠశాలను నడుపుతున్నానని, అక్కడ 400 మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నానని ఉద్దేశ్య సచన్ చెప్పారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని ఒక చెట్టు కింద కొద్దిమంది పిల్లలకు పాఠాలు చెప్పడం ద్వారా ఈ పాఠశాలను ప్రారంభించారు. గత కొన్నేళ్లలో ఈ పాఠశాల విస్తరించి, ప్రస్తుతం సొంత భవనాన్ని కలిగి ఉంది. 12వ తరగతి వరకు పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఫీజులు లేకుండా మరింత మంది పిల్లలకు విద్యను అందించడానికి దీనిని ఇంకా విస్తరించాలని ఆయన భావిస్తున్నారు.
ఇదీ చదవండి: నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్
విద్యావ్యవస్థ చాలా ఖరీదైనదిగా మారిందని, పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారనే ఈ పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. వీరిలో చాలామంది పిల్లలు సమీపంలోని మురికివాడల (స్లమ్స్) నుండి వస్తారు. దీని ద్వారా తనకు ఎలాంటి ఆదాయం రాదని, తన ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం తన అన్నయ్య చూసుకుంటారని తెలిపారు.
కాగా ఉద్దేశ్య తండ్రి దర్జీగా (టైలర్) పనిచేస్తూ నెలకు రూ. 4000-5000 మాత్రమే సంపాదించేవారు. విద్యుత్ షాక్ కారణంగా ఆయన తల్లి అనారోగ్యానికి గురైన తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. తండ్రి ఫీజు చెల్లించలేకపోవడంతో ఉద్దేశ్యను 6 - 9 ఏళ్ల వయస్సులో రెండుసార్లు పాఠశాల నుండి పంపించివేశారు. ఫీజులు చెల్లించనందుకు పాఠశాల ఉపాధ్యాయులు ఆయన తల్లిదండ్రులను తరచూ అవమానించేవారని గుర్తు చేసుకున్నారు. ఆ వయసులోనే అయన అనుభవించిన అవమానాలు, మానసిక క్షోభే ఈనాటి ఉచిత విద్యకు పునాది అని చెప్పారు.
ఇదీ చదవండి : నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్
రూ. 250తో స్కూలుకు నాంది పడిందిలా
ధాబా, కేఫ్ ,కొన్ని కర్మాగారాల్లో (ఫ్యాక్టరీలు) చిన్న చిన్న పనులు చేస్తూ, తండ్రి సహాయంతో తన చదువును పూర్తి చేశారు. అయితే తనలాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉంటారని గ్రహించి, వారి జీవితాలను మార్చడానికి విద్య ఒక్కటే మార్గమని నమ్మి ఈ దిశగా అడుగులు వేశారు.
తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని స్థానికంగా ప్రచారం చేయడానికి కొన్ని పాంప్లెట్లు ప్రింట్ చేయించి పాఠశాలను ప్రారంభించినట్లు ఉద్దేశ్య చెప్పారు. ప్రారంభ రోజుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి పిల్లలను చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఆయన పాఠశాలకు విరాళాలు ఇచ్చారు. నటుడు ఆర్. మాధవన్ దీనిపై ఒక పోస్ట్ షేర్ చేసినప్పుడు పాఠశాలకు భారీగా విరాళాలు వచ్చాయి. ఇది విన్న అమితాబ్ బచ్చన్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈ పాఠశాల గురించి ప్రచారం చేస్తానని ప్రకటించారు.
KBC 18లో ఉద్దేశ్య ఎదుర్కొన్న రూ. 25 లక్షల ప్రశ్న:
ఏ ప్రాచీన భారతీయ పాలకుడిని 'అమిత్రఘాత' అనే బిరుదుతో కూడా పిలిచేవారు?
ఆప్షన్లు: సమ్రాట్ అశోకుడు, బింబిసారుడు, సముద్రగుప్తుడు, బిందుసారుడు
ఉద్దేశ్య 'మహాఫ్లిప్' లైఫ్‌లైన్ ఉపయోగించిన తర్వాత ఈ ప్రశ్న వచ్చింది. దీని సమాధానంపై కూడా ఆయనకు స్పష్టత లేకపోవడంతో 50:50 లైఫ్‌లైన్ ఎంచుకున్నారు. లైఫ్‌లైన్ తర్వాత తెరపై మిగిలిన రెండు ఆప్షన్లు: బింబిసారుడు , బిందుసారుడు.
సరియైన సమాధానం తెలియకపోవడంతో, ఆయన గేమ్‌ను క్విట్ చేసి క్విట్ చేసిన తర్వాత, ఊహించి ఒక సమాధానం చెప్పమని కోరగా, ఆయన 'బిందుసారుడు' అని చెప్పారు. అదే సరైన సమాధానం.
‘అమిత్రఘాత’ అంటే
మగధను పాలించిన మౌర్య సామ్రాజ్య రెండవ చక్రవర్తి బిందుసారుడిని 'అమిత్రఘాత' అని పిలిచేవారు. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని కుమారుడు, అలాగే మౌర్య సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడైన అశోకుడి తండ్రి. బిందుసారుడి పాలన క్రీ.పూ. 297 నుండి క్రీ.పూ. 273 వరకు కొనసాగింది. ఈ పేరు 'అమిత్ర' (శత్రువు), 'ఘాత' (సంహారకుడు) అనే పదాల కలయికతో ఏర్పడింది. అంటే "శత్రు సంహారకుడు" అని అర్థం. విశేషమేమిటంటే, ప్రాచీన గ్రీకు రచయిత స్ట్రాబో ఆయనను 'అమిట్రోచేట్స్' (Amitrochates) అని పిలిచారు, ఇది సంస్కృత బిరుదు అమిత్రఘాతకు గ్రీకు రూపం.


