‘అమ్మనా కోడలా?’.. స్టెప్పులేస్తూ.. మామ ప్రాణం తీయించింది | businessman Vineet Manocha case update | Sakshi
Sakshi News home page

‘అమ్మనా కోడలా?’.. స్టెప్పులేస్తూ.. మామ ప్రాణం తీయించింది

Sep 10 2026 5:38 PM | Updated on Sep 10 2026 6:41 PM

businessman Vineet Manocha case update

లక్నో: ప్రముఖ వ్యాపారి వినీత్‌ మనోచా హత్య కేసులో కోడలు షాలు(30) దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుఫారీ గ్యాంగ్‌ మనోచాను కత్తితో పొడుస్తున్న సమయంలో కోడలు షాలు బాలీవుడ్‌ ఓల్డ్‌ క్లాసిక్‌ పాటలకు డ్యాన్స్‌ చేస్తున్నట్లు తేలింది. సంబంధిత దృశ్యాలు వెలుగులోకి రాగా.. పోలీసులు విచారణలో కోడలు షాలు సైతం అంగీకరించింది. 

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారి వినీత్ మీనోచా హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కుటుంబ వ్యాపారంలో తగిన స్వేచ్ఛ లేకపోవడం, చిన్న ఖర్చులకు కూడా మామను అడగాల్సి రావడం, ఇంట్లో సీసీటీవీల ద్వారా తన కదలికలపై నిరంతరం నిఘా పెట్టడంపై కోడలు షాలు తీవ్ర కక్ష పెంచుకుంది. అర్ధరాత్రి వరకు పార్టీలకు వెళ్లనివ్వకపోవడం, ఆలస్యంగా రావడాన్ని ప్రశ్నించడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని తేలింది.

పోలీసులు నిందితుల కాల్ డీటెయిల్ రికార్డ్స్‌ పరిశీలించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. హత్యకు ముందు కేవలం 21 రోజుల్లో మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్‌తో కుటుంబ సభ్యులు విపరీతంగా సంప్రదింపులు జరిపారు. కోడలు షాలు సుమారు 30 సార్లు, ఆమె భర్త సుబ్రత్ సుమారు 300 సార్లు విశాల్‌తో ఫోన్లో మాట్లాడారు. మొత్తం కలిపి ఈ సంఖ్య 330కి చేరింది. హత్య జరిగిన రోజు ఒక్కరోజే ఉదయం నుంచి రాత్రి వరకు షాలు, విశాల్ మధ్య ఏకంగా 14 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

జూలై 28న ఆలస్యంగా ఇంటికి వచ్చిన షాలు మామతో గొడవ పడిన తర్వాతే ఈ హత్యకు ప్లాన్ వేసింది. మాజీ పనిమనిషి విశాల్‌ గౌతమ్‌కు రూ.6 లక్షలకు సుపారీ ఇచ్చి, ముందుగా రూ.2 లక్షలు చెల్లించి డూప్లికేట్ తాళం చెవిని అందజేసింది. పథకం ప్రకారం హత్యకు గురైన రోజు షాలు, ఆమె భర్త తమ బిడ్డతో కలిసి కాన్పూర్‌లోని కాస్మోజిన్ లాంజ్‌లో జరిగిన పార్టీకి వెళ్లారు.

అక్కడ షాలు తన స్నేహితులతో కలిసి బాలీవుడ్ పాటలకు స్టెప్పులెస్తోంది. మరోవైపు మామను ఎలా హత్య చేయాలో నిందితులకు గైడెన్సీ ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో విశాల్, మరో నిందితుడు రాజ్ కిషోర్‌ మందులు ఇవ్వడానికి వచ్చామంటూ సెక్యూరిటీ గార్డ్‌ను నమ్మి లోపలికి వెళ్లారు. 63 ఏళ్ల వినీత్ మీనోచాను కత్తితో పొడిచి చంపారు.

పోలీసుల అరెస్టు
అర్ధరాత్రి 3 గంటలకు షాలు దంపతులు ఇంటికి తిరిగి వచ్చేసరికి వినీత్ మీనోచా రక్తపు మడుగులో పడి ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, ఎన్‌కౌంటర్ తర్వాత నిందితులు విశాల్, రాజ్‌ కిషోర్‌లతో పాటు సూత్రధారైన కోడలు షాలును అరెస్టు చేశారు. మొదట అమాయకురాలిగా నటించినప్పటికీ, పోలీసుల విచారణలో షాలు తన నేరాన్ని అంగీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement