బాంబును ఉమర్ కారు లోపల కూర్చునే పేల్చేశాడు
ఎర్రకోట వద్ద పేలుడుపై ఎన్‌ఐఏ చార్జ్‌షిట్
న్యూఢిల్లీ: భారత దేశ చారిత్రక కట్టడాల్లో ఎర్రకోటకు ప్రత్యేక స్థానముండటంతో ఉద్దేశపూర్వకంగానే అక్కడ పేలుళ్లకు పథక రచన చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. గత ఏడాది నవంబర్ పదో తేదీన ఎర్రకోట సమీపంలో పేలుడు ముమ్మాటికీ ఆత్మాహుతి దాడి అని ఎన్‌ఐఏ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్‌ఐఏ తాజాగా కోర్టుకు సమర్పించిన చార్జ్‌షిట్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
తొమ్మిది సంవత్సరాల క్రితం మాజీ హిజ్బుల్ మొజాహిదీన్ కమాండర్ జకీర్ రషీద్ భట్ స్థాపించిన అన్సార్ ఘజ్వత్–ఉల్–హింద్ ఉగ్రసంస్థను మళ్లీ క్రియాశీలకంగా మార్చేందుకు ఎర్రకోట ఆత్మాహుతి బాంబర్, వైద్యుడు ఉమర్ ఉన్ నబీ తీవ్రస్థాయిలో ప్రయత్నించాడు. ఆ సంస్థ(మాడ్యూల్)కు ఆపరేషనల్ ఇన్‌చార్జ్‌గా, మాస్టర్‌మైండ్‌గా మారాడు. చార్జ్‌షిట్‌లోని వివరాల ప్రకారం ఉమర్ ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్‌లో తన ఐ20 కారు ఆగిపోయినప్పుడు అత్యంత శక్తివంత పేలుడు పదార్థం(ఐఈడీ) డిటోనేటర్‌ను ఉపయోగించి ఆత్మాహుతికి పాల్పడ్డాడు.
దీంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి హఠాత్తుగా జరిగిందికాదని, దాదాపు మూడేళ్లపాటు పక్కా ప్రణాళికతో దాడికి యత్నించారని ఎన్‌ఐఏ తెలిపింది. ఎర్రకోటను భారత గణతంత్ర రాజ్యాంగానికి ప్రతిబింబంగా భావిస్తుండటంతో అక్కడే పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టించాలని ఉమర్ గతంలోనే నిర్ణయించుకున్నాడు. 2023లోనే పలుమార్లు ఉమర్, అతని మాడ్యూల్ సభ్యులు పలుమార్లు ఎర్రకోట పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు.
అయితే 2025 నవంబర్ నెలలోనే పేలుడు మాత్రం ముందే అనుకున్నది కాదని, శ్రీనగర్ తదితర నగరాల్లో మాడ్యూల్ సభ్యుల వరసబెట్టి అరెస్టులతో కంగారుపడిన ఉమర్ ఒంటరిగానైనా పేలుడు జరపాలని ఆఖరి నిమిషంలో నిర్ణయించుకుని కారుబాంబుతో పేల్చేసుకున్నాడని చార్జ్‌షిట్‌లో ఎన్‌ఐఏ పేర్కొంది. ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్(టీఏటీపీ), అమ్మోనియం నైట్రేట్‌ల మిశ్రమంగా పేలుడుపదార్థాలతో నింపి కారును వెహికల్–బోర్న్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(వీబీఐఈడీ)గా మార్చి కమాండ్ మెకానిజంతో పేల్చేశారు.
అరేబియా ద్వీపకల్పంలోని అల్–ఖైదా ఉగ్రసంస్థ భారత్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా యువతను ఉగ్రవాదభావజాలంతో టెర్రరిజంలోకి దింపేందుకు, దాడులు చేసేందుకు ‘ఒంటరి మొజాహిదీన్ ఆత్మాహుతి బాంబర్‌గా మారడం ఎలా?’అనే మాన్యువల్‌ను తయారుచేసింది. దీనికి మతఛాందసవాద యువతలో విస్తృత ప్రచార కల్పించేందుకు దుస్సాహసంచేసిందని ఎన్‌ఐఏ పేర్కొంది. పేలుడు పదార్థాల తయారీ, ఆయుధాలను ఉపయోగించే తీరు, కోవర్ట్ ఆపరేషన్‌లు చేయడం, జట్టుగా ఉండకుండా ఒంటరిగా ఉంటూ దాడులుచేయడం, ఆత్మాహుతి దాడులకు పాల్పడటం వంటి అంశాలు ఈ డాక్యుమెంట్‌లో ఉన్నాయి.
‘జిహాద్ అంటే ఏమిటి?, జిహాద్‌కు ఉండాల్సిన అర్హతలు, జిహాద్‌లోని 21 లక్ష్యాలు, జిహాద్ ద్వారా చేయగల 39 రకాల సేవలు, జిహాద్‌లో ఎలా పాల్గొనాలి? జిహాద్‌కు మద్దతిచ్చేందుకు 44 మార్గాలు ఇలా పలు రకాల అంశాలు అందులో ఉన్నాయి. సాయుధ హింసను ప్రోత్సహించి తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను పడగొట్టి జిహాద్‌ను మతపరమైన విధిగా ఎలా పాటించాలో అందులో పేర్కొన్నారు. అన్సార్ ఘజ్వత్–ఉల్–హింద్ మాడ్యూల్ సభ్యుల మధ్య సమావేశాలు ఏర్పాటుచేయడం, సిగ్నల్ వంటి ఎన్‌క్రిపె్టడ్ యాప్‌ల ద్వారా రహస్య మంతనాలు జరపడం, పేలుడు పదార్థాల తయారీకి ప్రమాదకర రసాయనాలను గంపగుత్తగా కొనుగోలుచేయడం, బాంబుల తయారీ, నిధుల సమీకరణ, యువతను ఉగ్రవాదంలోకి రావాలని ప్రోత్సహించడం వంటి నేరాలకు ఉమర్ పాల్పడినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.


