77 కిలోమీటర్ల మేర మూడు, నాలుగు లైన్ల నిర్మాణం
తిరుపతి, యాదగిరిగుట్ట క్షేత్రాలకు మెరుగైన కనెక్టివిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) దేశవ్యాప్తంగా రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 17 జిల్లాల మీదుగా ఐదు ప్రాజెక్టులు నిర్మించనున్నారు.
ఇందులో భాగంగా ఏపీ పరిధిలో రేణిగుంట–అరక్కోణం మార్గంలో 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైను పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పనులను 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద రూపొందించారు. తద్వారా ప్రజల రాకపోకలతో పాటు సరుకు రవాణా అత్యంత సులభతరం కానుంది. పనులు పూర్తయితే రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యం పెరిగి రైళ్ల రద్దీ తగ్గుతుంది.
ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు మహర్దశ
ఈ రైల్వే లైన్ల విస్తరణ పనులతో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడనుంది. ఏపీలోని తిరుపతి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాలకు, తెలంగాణలోని యాదగిరి గుట్ట ఆలయానికి ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మొత్తంగా ఐదు ప్రాజెక్టుల వల్ల సరుకు రవాణా సామర్థ్యం పెరగడంతోపాటు, ఇంధన ఆదాతో పాటు పర్యావరణానికి భారీ ప్రయోజనం కలగనుంది. వాతావరణంలోకి 42 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది సుమారు 2 కోట్ల చెట్లను నాటడంతో సమానమని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.


