బాబు బూటకపు హామీలు నమ్మి మోసపోయామంటున్న జనం
వైఎస్సార్‌సీపీ పాలనను, బాబు రెండున్నరేళ్ల పాలనను పోల్చుకుంటున్న ప్రజలు
ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ సంతకాలు, ఫొటోలతో బాండ్లు పంపిన బాబు
జగన్ ఇచ్చిన పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామని హామీలు
ప్రతి పిల్లాడికీ, ప్రతి రైతుకీ, ప్రతి మహిళకూ ఎక్కువ ఇస్తామంటూ ప్రచారం
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50ఏళ్లకే పెన్షన్.. అన్నీ మోసం
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో దారుణంగా వంచించారు
జగన్ హయాంలో కనీసం నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాయి.. ఇప్పుడు ఏదీ లేదంటున్న ప్రజలు
స్థానిక ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడాలి.. పోరాడాలి
ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధం.. సాఫీగా జరిగితే మనదే విజయం
స్థానిక ఎన్నికలపై చంద్రబాబు మేకపోతు గాంభీర్యం
కోర్టు కొట్టేసినా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామాలు
ప్రజలకు తోడుగా కార్యకర్తలుండాలి..వారికి తోడుగా పార్టీ ఉంటుంది
శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం
పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్చూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం
వచ్చే సెప్టెంబర్‌లో పాదయాత్ర
చూస్తుండగానే కళ్లు మూసి తెరిచేసరికి దాదాపు రెండున్నర ఏళ్లు గడిచాయి. ఇప్పుడు సెప్టెంబరు నెలలో ఉన్నాం. మళ్లీ కళ్లు మూసి తెరిచేలోగా ఏడాది గడిచి మళ్లీ సెప్టెంబరు వస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా యాత్ర జరుగుతుంది.
చంద్రబాబు చేసిన మోసమే ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చనీయాంశమైంది. జగన్ మోసం చేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఆ టైంలో కనీసం నాలుగువేళ్లు నోట్లోకి పోయాయి. కానీ, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. ఇవాళ నోట్లోకి ఏదీ పోవడం లేదు. చంద్రబాబు పుణ్యాన మా బతుకులు బస్టాండ్ అయిపోయాయి అన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది.
‘‘జగన్ ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. జగన్ ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్‌ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు.’’
‘‘చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్.’’
‘‘స్థానిక ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం.’’
‘‘ప్రజలకు మంచి చేసి.. ఫలాన మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి పాలకుడికి ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలు తోడుగా నిలబడతారు. కానీ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దౌర్జన్యాలు చేయడం, డైవర్షన్స్ చేస్తూ ఉండడాన్ని దేవుడు కరుణించడు. ప్రజలు హర్షించరు’’
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని, ఇది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హామీలు, మోసాలపైనే ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని, వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడాలని, పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు నిజాయితీగా జరిగితే విజయం తప్పకుండా వైఎస్సార్‌సీపీదే అని స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ గాదె మధుసూదన్‌రెడ్డి, పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..
కార్యకర్తలు గర్వపడేలా మన పాలన
మన 5 ఏళ్ల పాలన, బాబు రెండున్నర ఏళ్ల పాలనలో ఎంతో తేడా ఉంది. దీనిపైనే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదేళ్ల మన పరిపాలనలో ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ఫలానావాడు మా నాయకుడు, ఫలానా పార్టీ మా పార్టీ అని గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితి. మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే. రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలు ఇస్తారు. చంద్రబాబు లాంటి వాళ్లు అయితే ఏకంగా ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచిపెడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మ్యానిఫెస్టో, అందులో ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిని మార్చిన పాలన మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ, అందులో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే అని గర్వంగా చెప్పగలుగుతాం. అంతగా మాట ఇస్తే ఆ మాటపై నిలబడాలి అని తాపత్రయపడ్డాం. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఎప్పుడు ఇస్తాము అని ముందుగానే షెడ్యూల్ ప్రకటించి, ఒక్క పథకం కూడా మిస్ కాకుండా బటన్లు నొక్కి అమలు చేసిన పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహాలను పటాపంచలు చేశాం. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతి 50, 60 ఇళ్లకు ఒక వలంటీర్‌ను తీసుకొచ్చి, ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. ఇది వైఎస్సార్‌సీపీ హయాంలోనే జరిగింది.
వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు..
మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా మారాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు, మూడో తరగతి నుంచి టోఫెల్ పీరియడ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ అమలు చేయడం, నాడు–నేడు మనబడితో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చడం, ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లోనూ డిజిటలైజ్డ్ బోధన తీసుకొచ్చేలా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ చేయడం వైఎస్సార్‌సీపీ హయాంలోనే జరిగాయి. గోరుముద్ద అనే పేరుతో పిల్లలు ఏం తింటున్నారో, తినే ఆ తిండి బాగుందా లేదా అని పట్టించుకునే ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరైనా ఉంటారో లేదో తెలియదు కానీ జరిగింది ఒక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే. మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్‌బుక్స్.. ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషుతో బుక్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మనది. ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబ్‌లు పెట్టింది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పేదవాడికి ఇంకా తోడుగా ఉండేలా చాలా మార్పు చేశాం. మనం రాకముందు ఆరోగ్యశ్రీ పరిధి 1,000 ప్రొసీజర్లు. మనం వచ్చిన తర్వాత 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ప్రతి పేదవాడికి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించాం. నాడు–నేడుతో హాస్పిటల్స్ రూపురేఖలు మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు అందుబాటులో ఉంచాం. అదీ మన చరిత్ర. ఇంకా ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత జాతీయస్థాయిలో 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే.
ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టడం అన్నది కూడా గతంలో ఎప్పుడూ చూడని విషయం. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామస్థాయిలోనే ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు. ప్రతి డాక్టర్‌కు నాలుగైదు ఊళ్లు కేటాయింపు. ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే, మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు 104 అంబులెన్సులో పర్యటన. అలా ఆయా గ్రామాలు, అక్కడి వారితో డాక్టర్‌కు సాన్నిహిత్యం. అత్యుత్తమ వైద్య సేవలు. ఊరిలో పేషెంట్‌ను పేరు పెట్టి పిలవగలిగే పరిస్థితిలోకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇది కూడా గతంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. నష్టాల్లో ఉన్న రైతు. రైతు బ్రతుకంతా ఎప్పుడూ కష్టమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి నుంచి, రైతును పట్టించుకునే నాధుడు ఉండడు అన్న పరిస్థితి నుంచి, మొట్టమొదటిసారిగా రైతును చెయ్యి పట్టుకొని నడిపించాలని తపన పడింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే. అందుకోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఆ ఆర్బీకేలో అసిస్టెంట్‌గా అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్. ప్రతి ఎకరా ఈ–క్రాపింగ్.
వాటన్నింటి ద్వారా ప్రతి అడుగులోనూ రైతును చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం. ఆ ఆర్బీకేల్లో పంటల గిట్టుబాటు ధరల ప్రకటన. ఆ మేరకు పోస్టర్లు. ఏరోజైనా రైతుకు రేటు రాకపోతే వెంటనే ఆర్బీకేలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా యాక్టివేట్ చేస్తే, వెంటనే జాయింట్ కలెక్టర్, మార్క్ ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జోక్యం చేసుకోవడం, ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేయడం, అలా మార్కెట్లో పోటీని సృష్టించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడం అన్నది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సచివాలయంలో మన కళ్ళ ముందే దాదాపు పది మంది కళకళలాడుతూ సేవలు అందించే కార్యక్రమం. ప్రతి 50,60 ఇళ్లకు ఒక వలంటీర్. ఇళ్లకే వెళ్లి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు, ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తప్ప. వ్యవస్థలో కనీవిని ఎరుగని మార్పులు మన హయాంలోనే జరిగాయి.
చంద్రబాబు పచ్చి దగా
మనం ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. మనం ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్‌ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు. అప్పుడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఏమిటి? జగనైతే అమ్మఒడి కింద ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకరికే రూ.15 వేలు ఇస్తున్నాడు. మేమైతే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే, అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు ఇస్తామని చెప్పాడు. ఇంకా అంతటితో కూడా ఆగిపోలేదు. రైతు కనపడితే ఏమన్నాడు? జగన్ రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తే, తాను రూ.26 వేలు ఇస్తానన్నాడు. అంతటితో ఆగిపోలేదు. 45 ఏళ్ళు దాటిన మహిళలకు చేయూత కింద జగన్ ఇచ్చేది కేవలం రూ.18,750 అయితే, తాము 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. అలా నీకు రూ.48 వేలు, నీకు రూ.48 వేలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇంకా దాంతోనూ ఆగిపోలేదు. 20 ఏళ్ల పిల్లోడు కనపడితే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పాడు. అలా జగన్ కంటే అన్నీ ఎక్కువే ఇస్తానని నమ్మించాడు. ఆఖరికి వలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు.
దౌర్జన్యంతో పాలకులు రాజ్యం చేయలేరు
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దౌర్జన్యంతో ఎప్పుడూ కూడా పాలకులు రాజ్యం చేయలేరు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో నా పాదయాత్రకు ముందు నంద్యాల ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికల్లో విపరీతంగా పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగం చేశారు. దాంతో నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 34 వేల ఓట్లతో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైంది? మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబునాయుడు తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? దాని తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏం జరిగింది? ఒక సునామీ వచ్చింది. దేవుడు చంద్రబాబుకి ఎలా మొట్టికాయలు వేశాడో చూశాం. అదే నంద్యాలలో దాదాపు 40 వేల ఓట్లతో మనం గెలిచాము. చంద్రబాబు మన పార్టీ నుంచి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు. సరిగ్గా ఆ సంఖ్యలోనే ఆ పార్టీ గెలిచింది. మన దగ్గర నుంచి వెళ్లిన వాడు ఎవడూ గెలవలేదు ఒకడు తప్ప. అందరూ ఓడిపోయినారు.’’
జరగబోయేది కురుక్షేత్రం
ఇప్పటి ఈ ఎన్నికల కంటే కూడా రేపు పొద్దున జరగబోయే కురుక్షేత్రం ముఖ్యం. ఈ ఎన్నికల్లో చిన్న ప్రాణులను ఓడించడం కోసం చంద్రబాబు చేసిన అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి అన్నది ఆ ఎన్నికల్లో రావాలి. అలాంటి కసి కార్యకర్తలకు రావాలి. ఆ కార్యకర్తకు పార్టీ అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతుంది. ఇది కార్యకర్తల కోసం జరుగుతున్న ఎన్నికలు. మనం కార్యకర్తలకు తోడుగా ఉండాల్సిన ఎన్నికలు. ప్రజలకు తోడుగా కార్యకర్త నిలబడతాడు. కార్యకర్తకు తోడుగా పార్టీ నిలబడుతుంది అన్న సంకేతం ఈ ఎన్నికల ద్వారా మనం ఇవ్వాలి.
స్థానిక ఎన్నికలపైనా చంద్రబాబు డ్రామా.. కుట్ర
ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే చంద్రబాబు ఆ ఎన్నికలు పెడతాడో లేదో తెలియదు. కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిజంగా స్థానిక ఎన్నికలు పెట్టే వాడే అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చే వాడు కాదు. దీనికి సంబంధించి నాడు మన హయాంలో ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేసింది. అయినా అంతకన్నా ఎక్కువ పదవులు మనం బీసీలకు ఇచ్చాం. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆ బీసీ రిజర్వేషన్లు తెలంగాణాలోనూ కొట్టేశారు. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవకాశం ఉందని తెలిసినా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగకూడదు. వాయిదా పడాలన్నదే ఆయన కుట్ర. మరొకటి ‘సర్’. (ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ) వీళ్ళే అంటున్నారు ఇక్కడ 44 లక్షల ఓట్లు లేవు అని. అయితే పాత జాబితాలతో ఎన్నికలు పెడతాడా? దానికి ఏ కోర్టయినా ఒప్పుకుంటుందా? మరి చంద్రబాబు ఎన్నికలు పెట్టాలని ఇవన్నీ చేస్తున్నాడా? పెట్టకూడదని చేస్తున్నాడా? ఇది మేకపోతు గాంభీర్యం కాకపోతే ఇదంతా ఏమిటి? సరే, ఏదైనా కానీ, చంద్రబాబుగారు స్థానిక ఎన్నికలు పెడతాడని అనుకుని, ముందుకు పోదాం.
ఎన్నికలు సాఫీగా జరిగే వీలు లేదు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు సాఫీగా జరుగుతాయని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. చంద్రబాబుని ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్. ఇది కాక రెడ్‌బుక్ రాజ్యాంగం. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు సాఫీగా జరుగుతాయని అనుకోవడం లేదు.
సాఫీగా జరిగితే మనదే విజయం
ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం. చంద్రబాబు ఒకవేళ ఓడించే కార్యక్రమం, అధికార దుర్వినియోగం చేసే కార్యక్రమం, పోలీసులు జులుంను ఉపయోగించే కార్యక్రమం చేస్తే ఎవరిని ఓడించడం కోసం? ఆ చిన్న ప్రాణాన్ని ఓడించడం కోసం. ఆ చిన్న ఎంపీటీసీ స్థానం, ఆ చిన్న సర్పంచ్ స్థానం, ఆ చిన్న వార్డ్ మెంబర్ స్థానంలో ఉన్న వ్యక్తులను ఓడించడం కోసం. అందుకే అటువంటి చిన్న ప్రాణాలకు తోడుగా ఉండాలి.


