చట్టసభల్లో బీసీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పెద్దపీట
20 ఏళ్లుగా బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు
బీసీ సామాజికవర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు
బీసీల పార్టీ అని చెప్పుకొనే నైతికహక్కు టీడీపీకి లేదు
చంద్రబాబు మోసాలపై బీసీల్లో చైతన్యం తేవడానికి సభలు
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘ఉత్తరాంధ్రలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో 60 నుంచి 70 శాతం మంది బీసీలే. వారి సంఖ్యను కలిపేసి రాష్ట్రంలో బీసీల నిష్పత్తిని చూపిస్తున్నారు. అసలు అన్ని కులాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కప్పిపుచ్చి, ఒక్క బీసీలకే 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే కల్పించినట్లు మసిపూసి మారేడుకాయ చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 20 ఏళ్ల పాలనలో బీసీలకు ఎన్నికలకు ముందు తాయిలాలు తప్ప వారి అభివృద్ధికి చేసింది శూన్యం.
ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా బీసీల సర్వతోముఖాభివృద్ధి ఎలా చేయాలో చేసి చూపించింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. బీసీల ఉద్ధారకుడు ఆయన మాత్రమే. బీసీల కోసం చంద్రబాబు చేసింది శూన్యం. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకొనే నైతికహక్కు చంద్రబాబుకు లేనేలేదు’ అని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన బుధవారం న్యూఢిల్లీలో ‘సాక్షి’తో మాట్లాడారు. బీసీల కృతజ్ఞత సభ అంటూ నర్సీపట్నంలో పుష్పాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేయించుకున్నంత మాత్రాన బీసీల ఉద్ధారకులు అయిపోరని చంద్రబాబును ఎద్దేవా చేశారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో, రాజకీయ సభల్లో ఇచ్చే హామీల కన్నా, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించారనేదే ఒక పార్టీ తమది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి ప్రామాణికం అవుతుందని చెప్పారు. అలా చెప్పుకోదగిన ప్రయోజనమేదైనా చంద్రబాబు చేశారేమో చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో బీసీలకు ఏయే ప్రయోజనాలు కల్పించారో చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయన్నారు.
చట్టసభల్లో బీసీలకు జగన్ పెద్దపీట
విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు చట్టసభల్లో పెద్దపీట వేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పారు. ఒకేదఫా నలుగురు బీసీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారని గుర్తుచేశారు. అది చాలా గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఆ స్థాయిలో బీసీలను రాజ్యసభకు పంపారా? అని ప్రశ్నించారు. ‘శాసనమండలిలో 2023లో 18 స్థానాలు ఖాళీ అయితే, 11 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారు.
మొత్తం 44 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల్లో 19 మంది బీసీ నాయకులే. గతంలో ఎప్పుడూ బీసీలకు అంత పెద్దసంఖ్యలో ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికల్లో కూడా జగన్‌మోహన్‌రెడ్డి 25 లోక్‌సభ స్థానాలకుగాను 11 చోట్ల బీసీలకే టికెట్ ఇచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 48 చోట్ల బీసీ అభ్యర్థులనే నిలబెట్టారు. మొత్తం బీసీలకు 59 సీట్లు అంటే దాదాపు చట్టసభల్లో 30 శాతం రిజర్వేషన్లు ఆయన చెప్పకుండానే ఇచ్చారు’ అని వివరించారు. ఇలా బీసీలకు చట్టసభల్లో అగ్రస్థానం కల్పించి, తమ అభిప్రాయాలను, నిర్ణయాలను గళమెత్తి చెప్పడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు.
చంద్రబాబు కేబినెట్‌లో బీసీ మంత్రులెందరు?
తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే పూర్వం ఎన్.టి.రామారావు బీసీ పట్ల కాస్త ఉదారంగా ఉండేవారని చెప్పారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఎన్నికల్లో భారీ హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనబెట్టేసే చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్‌లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులిచ్చారో చూస్తే అసలు విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 11 మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారని గుర్తుచేశారు.
బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఏది?
రాష్ట్రంలోని బీసీలకు ఏంకావాలో చూడాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏనాడూ లేదని విమర్శించారు. ఉదాహరణకు బీసీల్లో ఒకరైన లక్షలాదిమంది మత్స్యకారులు సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్న ఈ రాష్ట్రాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారంటే చంద్రబాబు తన 20 ఏళ్ల పాలనలో వారి అభివృద్ధికి ఏం చేసినట్లని ప్రశ్నించారు. వారికోసం ఒక్క ఫిషింగ్ హార్బర్‌ను కూడా నిర్మించలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తలపెట్టారని గుర్తుచేశారు. వాటిలో కొన్ని నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కొన్నింటిని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆపేశారని విమర్శించారు.
బీసీల విద్యకు జగన్ ప్రాధాన్యం
తరతరాలుగా వ్యవసాయం, చేతివృత్తుల్లోనే ఉన్న బీసీలు పారిశ్రామికీకరణ తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో వారిని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య మాత్రమేనన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ, పేద కుటుంబాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసే పాలసీలనే అమలుచేస్తున్నారని విమర్శించారు.
అందుకు భిన్నంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మాత్రమే పేద కుటుంబాల్లోని విద్యార్థులకు విద్యను చేరువచేసే ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మ ఒడి వంటి సంక్షేమ పథకాలను చేపట్టారని గుర్తుచేశారు. వారి పేదరికం ఏరోజూ వారి చదువుకు అడ్డుకాకుండా చేయగలిగిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కుతుందన్నారు. చంద్రబాబు ఆ పథకాలను నీరుగారుస్తూ తిరోగమన విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు.
బీసీల అభివృద్ధి జగన్ పాలనతోనే తెలిసింది
అంతవరకు బీసీలకు చిన్నచిన్న తాయిలాలతోనే చంద్రబాబు పాలన సాగిందని, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి ఇంత చేయవచ్చా అని తెలిసిందని చెప్పారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేదల్లో ఎక్కువమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలేనన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 12 వేల ఎకరాలను సేకరించి, దాదాపు 30 లక్షలమంది మహిళలకు ఇచ్చిన ఇళ్లపట్టాల్లో ఎక్కువ లబ్దిపొందింది బీసీ సామాజికవర్గాలేనని చెప్పారు. మరి చంద్రబాబు గత రెండేళ్ల పాలనలో పేదవారి కోసం ఒక్క సెంటు భూమి అయినా సేకరించారా? అని ప్రశ్నించారు.
ధనవంతులైన పారిశ్రామికవేత్తలకు మాత్రం రూపాయికి, పావలాకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. తాము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని, కానీ భూపంపిణీ విధానమే సరైంది కాదని చెబుతున్నామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలను కూడా వ్యాపార, వాణిజ్య, ఐటీ, పారిశ్రామికరంగాల్లో ప్రోత్సహించే చర్యలనే ఏ ప్రభుత్వమైనా చేపట్టాలన్నారు. ఆ పనిని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించారని చెప్పారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో బీసీలే కాదు అన్ని సామాజికవర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనే మాట వినిపిస్తోందని తెలిపారు.
ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు
మళ్లీ ఇప్పుడు స్థానికసంస్థల ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ఇంకా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాయమాటలను మళ్లీ నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. చంద్రబాబు గారడీ మాటలపై బీసీలను చైతన్యం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తొలుత ఐదు రీజియన్ల వారీగా, తర్వాత దఫాలో 25 జిల్లా కేంద్రాల్లో, 175 నియోజవర్గాల వారీగా ఈ సభలు నిర్వహిస్తామని వివరించారు. బీసీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందీ, చంద్రబాబు పాలనలో ఏం మోసం జరిగిందీ వివరిస్తామన్నారు. ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలో, బీసీల నుంచి ఎలాంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాలో నిర్ణయిస్తామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు.


