క్విక్ కామర్స్ కిక్కు
దసరా నుంచి దీపావళి దాకా.. రూ.లక్షన్నర కోట్ల ఈ–కామర్స్ జాతర
పండగల అమ్మకాల కోసం భారీగా నియామకాలు చేస్తున్న ఈ–కామర్స్ సంస్థలు
ఈ ఏడాది 20 శాతం వృద్ధితో 2.7 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాయని అంచనా
400 పట్టణాల్లో 1.6 లక్షల మందిని నియమించుకున్నట్టు ప్రకటించిన అమెజాన్
సాక్షి, అమరావతి: వరుసగా వచ్చే పండగల సీజన్ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఈ కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో మొదలైన ఈ హడావిడి వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ వరకు కొనసాగుతుంది. కేవలం ఈ ఐదు నెలల కాలంలోనే రూ.లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇందులో అత్యధిక శాతం కొనుగోళ్లు చేసేది జెన్‌జీయే. అందుకే ఈ జనరేషన్ అలవాట్లకు తగ్గట్టుగా వేగంగా డెలివరీ చేయడానికి ఈ–కామర్స్ సంస్థలు భారీ నియామకాలను చేపట్టాయి.
కేవలం పండగల సీజన్ కోసం గతేడాది కంటే 15 నుంచి 20 శాతం అధికంగా నియామకాలు చేపట్టే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈ సీజన్‌లో సేవలందించడం కోసం తాత్కాలికంగా 2.7 లక్షల మందిని నియమించుకోవచ్చన్నది అంచనా. ఇప్పటికే ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ 1.6 లక్షల మందిని నియమించుకున్నట్టు ప్రకటించింది. డెలివరీ బాయ్ నుంచి ఫ్రంట్‌లైన్ ఆఫీసర్లు, స్టోర్ కీపర్స్, వేర్‌హౌస్ ప్యాకర్స్, లాజిస్టిక్ ఇలా రకరకాల సేవలకు వీరిని వినియోగంచనున్నారు. మీషో అయితే కొనుగోళ్లు, అమ్మకాలు, లాజిస్టిక్స్ నిర్వహణ ద్వారా కనీసం 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెబుతోంది.
రూ.1.55 లక్షల కోట్ల వ్యాపారం అంచనా
ఏడాది మొత్తం మీద జరిగే ఆన్‌లైన్ వ్యాపారంలో 80 నుంచి 90 శాతం కేవలం పండగల సీజన్ నుంచే వస్తుంది. 2025 పండగల సీజన్‌లో రూ.1.2 లక్షల కోట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది 29 శాతం వృద్ధితో రూ.1.55 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ–కామర్స్ సంస్థలు కేవలం నగరాలు, ప్రధాన పట్టణాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుండటంతో ఈ ఏడాది అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పండగల సీజన్ అమ్మకాల్లో అత్యధికంగా 60 శాతం సెల్‌ఫోన్లు వంటి ఎల్రక్టానిక్ వస్తువులు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్‌లు వంటి హోమ్ అప్లయెన్సెస్ నుంచే ఉంటున్నాయి.
ఈ–కామర్స్‌కు అదనంగా ఈ ఏడాది క్విక్ కామర్స్ (ఆర్డర్ పెట్టిన 10 నిమిషాల్లోనే డెలివరీ చేసే) సంస్థలు బాగా విస్తరించడంతో మార్కెట్ పరిమాణం బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా క్విక్ కామర్స్ సంస్థలు తమ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్‌ను ద్వితీయ శ్రేణి పట్టణాలకు బాగా విస్తరించాయి. ఈ–కామర్స్ సంస్థలో పనిచేసే గిగ్ వర్కర్లు ప్రతినెలా సగటున రూ.22 వేల నుంచి రూ.32 వేల వరకు సంపాదిస్తున్నారు. ఈ ఏడాది గిగ్ వర్కర్ల వేతనాల్లో 8శాతం వృద్ధి ఉంటుందని అంచనా.


