మెగా డీఎస్సీలో ‘ఓపెన్‌’ స్కామ్‌! | Injustice to toppers as replacements are made regardless of DSC exam | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీలో ‘ఓపెన్‌’ స్కామ్‌!

Sep 10 2026 4:00 AM | Updated on Sep 10 2026 4:00 AM

Injustice to toppers as replacements are made regardless of DSC exam

రిజర్వేషన్ల అమలులో ఇష్టారాజ్యం 

బాబు సర్కారు నిర్వాకాలతో తారుమారైన అభ్యర్థుల తలరాతలు

మంచి ర్యాంకుతో మెరిట్‌ సాధించిన అభ్యర్థులు.. రిజర్వుడు కేటగిరీల్లో భర్తీ  

ఓపెన్‌లో భర్తీ చేయాల్సిన అభ్యర్థి.. బీసీ–ఏ కేటగిరీలో నియామకం 

దీంతో అవకాశం చేజారి తీవ్రంగా నష్టపోయిన బీసీ–ఏ కేటగిరీ మెరిట్‌ అభ్యర్థులు 

స్పోర్ట్సు కోటా రిజర్వేషన్‌ ముందుగా ప్రకటించకుండా నేరుగా పోస్టుల భర్తీ  

డీఎస్సీ పరీక్షతో సంబంధం లేకుండా భర్తీ చేయడంతో టాపర్స్‌కు అన్యాయం

ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించిన వైనం  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  మెగా డీఎస్సీ 2025 ముసుగులో అసలు పరీక్షే లేకుండా టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం.. ప్రతిభకు పాతర.. స్పోర్ట్స్‌ కోటాతో ఇష్టారాజ్యంగా జీవోలు.. గోల్డ్‌ మెడల్‌ విజేతలను పక్కనపెట్టి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి ఉద్యోగాలివ్వడం.. బేరసారాల కాల్‌ రికార్డింగ్స్‌ వైరల్‌ కావడం.. ఆటల్లో పాల్గొన్నట్లు ఫేక్‌ సర్టిఫికెట్లు పెట్టిన వారికి పోస్టింగ్స్‌ ఇవ్వడం.. కనీసం టెట్‌ క్వాలిఫై కానివారిని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో నియమించడం లాంటి దారుణాలు ఇప్పటికే బహిర్గతం కాగా రిజర్వేషన్‌ అభ్యర్థులకూ ద్రోహం చేసినట్లు వెలుగులోకి వస్తోంది. 

మంచి ర్యాంకుతో మెరిట్‌ సాధించిన అభ్యర్థిని ఓపెన్‌ కేటగిరీలో కాకుండా బీసీ కేటగిరీలో భర్తీ చేయడంతో బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు తమ తలరాతలు మారిపోయి తీరని నష్టం వాటిల్లినట్లు ఆక్రోశిస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మెగా డీఎస్సీ ప్రక్రియలో స్పోర్ట్సు కోటా జీవోలు, రిజర్వేషన్ల అమలులో ఘోర తప్పిదాలపై రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాత పరీక్షలో మెరిట్‌ సాధించడంలో విఫలమైన వారికి స్పోర్ట్స్‌ కోటా పేరుతో పోస్టింగ్‌లు ఇచ్చారని అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ బరి తెగింపు వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. 

ఓపెన్‌లో కాకుండా బీసీ–ఏ కేటగిరీలో భర్తీ.. 
మెగా డీఎస్సీలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల యాజమాన్యా­ల పరిధిలో కలిపి 72 స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో ఓపెన్‌ కేటగిరీలో 30 పోస్టులు కేటాయించగా, అందులో తొమ్మిది మహిళలకు కేటాయించా­రు. 6, 8, 13, 30, 35, 50, 57, 60, 70 ర్యాంకుల అభ్యర్థులను ఓపెన్‌ కేటగిరీ మహిళా కోటాలో నియమించారు. అయితే 29వ ర్యాంకు వచ్చిన మహిళా అభ్యర్థిని మా­త్రం ఓపెన్‌లో కాకుండా బీసీ–ఏ కేటగిరీలో భర్తీ చేశారు. దీంతో బీసీ–ఏ కేటగిరీలో మెరిట్‌లో ఉన్న అభ్యర్థులు నష్టపోయా­రు.   

» బీసీ–ఏ కేటగిరీలో 5 పోస్టులు కేటాయించగా పురు­షులకు నాలుగు, మహిళలకు ఒక పోస్టు రిజ­ర్వు చేశారు. కానీ పోస్టుల భర్తీ సమయంలో ఓపెన్‌లో ఉండాల్సిన 29వ ర్యా­ంకు మహిళా అభ్య­ర్థినిని తీసుకొచ్చి.. బీసీ–ఏ కేటగిరీలో భర్తీ చేశారు. ఇలా చూసినా బీసీ–ఏ మహిళా కేటగిరీ పూర్తయినట్టే. కానీ, 82వ ర్యాంకు వచ్చిన మరో మహిళా అభ్యర్థిని కూడా బీసీ–ఏ మహిళా కేటగిరీ కింద నియమించారు. దీంతో బీసీ–ఏ కేటగిరీలో ఇద్దరు మహిళలను నియమించినట్లయింది. దీనివల్ల మెరిట్‌లో ఉన్న పురుషులకు నష్టం జరిగింది.  

» మెగా డీఎస్సీలో మెరిట్‌లో ఉన్న బీసీ–ఏ అభ్యర్థులకు స్పోర్ట్స్‌కోటా జీవోతో మరింత నష్టం వాటి­ల్లింది. నోటిఫికేషన్‌లో రెండు పోస్టులు కేటాయి­ంచగా వాటిని ఏ రిజర్వేషన్‌ కింద భర్తీ చేయాలో ప్రస్తావించలేదు. పోస్టుల భర్తీ సమయానికి బీసీ­–­ఏ కింద భర్తీ చేసేశారు. అంటే బీసీ–ఏ కేటగిరీ­లో మొత్తం ఐదు పోస్టులకు గాను ఇద్దరు మహి­ళా రిజర్వేషన్‌లో భర్తీ కాగా, మరో ఇద్దరు స్పోర్ట్సు కోటాలో భర్తీ కావడంతో డీఎస్సీ మెరిట్‌లో ఉన్నవారికి కేవలం ఒక­టే పోస్టు మిగిలినట్లు అయింది.

మెరిట్‌లో విఫలం.. స్పోర్ట్సు కోటాలో పోస్టింగ్‌
మెగా డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ విభాగంలో తమ్మినేని పైడిరాజుకు 46వ ర్యాంకు వచ్చింది. డీఎస్సీ మెరిట్‌ ప్రకారం బీసీ–ఏ కేటగిరీ కింద ఆయన భర్తీ కావాలి. కానీ వితవుట్‌ రిజర్వేషన్‌ కింద స్పోర్ట్స్‌ కోటాలో మరో అభ్యర్థికి ఇచ్చారు. ఈ అభ్యర్థి  రెండు రకాలుగా దరఖా­స్తులు చేసుకున్నారు. డీఎస్సీ మెరిట్, స్పోర్ట్సు కోటాలో దరఖాస్తు చేశారు. ఎగ్జామ్‌లో ఆయన 38.57705 స్కోర్‌తో 2,232 ర్యాంకు పొందగా మెరిట్‌లో అర్హత సాధించలేకపోయారు. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్సు కోటాలో నేరుగా.. డీఎస్సీ ఎగ్జామ్‌ మెరిట్‌ అభ్యర్థి స్థానంలో పోస్టింగ్‌ పొందారు. 

» మెగా డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ విభాగంలో వావిలాపల్లి కళాప్రతాప్‌కు 56వ ర్యాంకు వచ్చింది. డీఎస్సీ మెరిట్‌ ప్రకారం బీసీ–ఏ కేటగిరి కింద ఆయన భర్తీ కావాలి. కానీ వితవుట్‌ రిజర్వేషన్‌ కింద స్పోర్ట్స్‌ కోటాలో మరో వ్యక్తిని నియమించారు. ఆయన కూడా  రెండు రకాలుగా దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ ఎగ్జామ్‌ మెరిట్, స్పోర్ట్సు కోటాకు దరఖాస్తు చేశారు. ఎగ్జామ్‌లో 33.33905 స్కోర్‌తో 2,746 ర్యాంకు సాధించారు. దీంతో ఎగ్జామ్‌ మెరిట్‌లో అర్హత సాధించలేకపోయారు. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్సు కోటాలో నేరుగా డీఎస్సీ ఎగ్జామ్‌ మెరిట్‌ అభ్యర్థి స్థానంలో నియమితులయ్యారు.

అన్యాయం చేశారు...
ఓపెన్‌ ర్యాంకర్‌ను తీసుకొచ్చి.. బీసీ–ఏ కేటగిరీలో భర్తీ చేశారు. స్టోర్సు కోటా నోటిఫికేషన్‌లో బీసీ–ఏ కింద రెండు పోస్టులు భర్తీ చేస్తామని ఎక్కడా చెప్పలేదు. మాకు అన్యాయం చేశారు. రెండు రకాలుగా నష్టపోయాం. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాం. కానీ అక్కడ మా బలం సరిపోవడం లేదు.   – వావిలాపల్లి కళాప్రతాప్, డీఎస్సీ మెరిట్‌ అభ్యర్థి, ఎస్‌ఎంపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement