రణస్థలం:
లావేరు మండలంలోని గుమడాం రెవెన్యూ పరిధిలో తాజాగా వేస్తున్న రియల్ వెంచర్‌పై స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కన్ను పడింది. కమీషన్ ఇస్తేనే ఇక్కడ లే అవుట్ రూపాంతరం చెందుతుంది, లేదంటే నిత్యం నరకం చూపిస్తామంటూ వేధిస్తున్నారు. గుమడాం రెవెన్యూ పరిధిలో సుమారు 22 ఎకరాల్లో భారీ రియల్ వెంచర్ వేసేందుకు తాజాగా నిర్మాణ పను లు జరుగుతున్నాయి. గెడ్డకు ఆనుకుని తారు రోడ్డు వరకు ఈ లే అవుట్ చదును చేస్తున్నారు. పొలాలను వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు చేసుకున్న దరఖాస్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది.
మా అనుమతి ఉండాల్సిందే..
రియల్ వెంచర్ వేసేందుకు భూమి చుట్టూ ప్రహరీ, రోడ్లు, కాలువలు వంటి నిర్మాణాలు చేసేందుకు విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఎప్పటి నుంచో పరిచయమైన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. వాళ్లు పని చేసేందుకు సిద్ధమవుతున్న దశలో ఈ విషయం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల చెవిలో పడింది. ఇదే అదనుగా కమీషన్ల కక్కుర్తితో ఆ ఇద్దరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మంది మార్బలాన్ని మోహరించారు. ‘మా అనుమతి లేకుండా ఎవడ్రా ఇక్కడ వెంచర్ వేసేది’ అంటూ వాళ్ల రాజకీయ కుయుక్తులకు పదును పెట్టారు. ఆ వెంచర్ చుట్టు పక్కల గ్రామ నాయకులకు కమీషన్ బాధ్యతలను అప్పగించారు.
మౌలిక వసతులు అడ్డగింత
రియల్ వెంచర్ వేస్తున్న వ్యక్తులతో ఆ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నేరుగా మాట్లాడకుండా స్థానిక గ్రామ టీడీపీ నాయకులను రంగంలోనికి దించారు. వైఎస్సార్ సీపీ కాంట్రాక్టర్లు పనులు చేస్తే ఇక్కడ సహించేది లేదని అడ్డుకున్నారు. గుమడాం, తామాడ పంచాయతీలకు చెందిన ఆ గ్రామ నాయకులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండతో రెచ్చిపోయారు. దీంతో చేసేది లేక పనులు ఆపి అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల దగ్గరకు రియల్ వెంచర్ వేసే కాంట్రాక్టర్లు వెళ్లారు. కూటమి నాయకులకే రోడ్లు, కాలువలు, ఇలా అన్నీ పనులు అప్పగించాలని లేదంటే సహించేంది లేదని తీర్పు ఇచ్చారు.
గుమడాంలో రియల్ వెంచర్‌పై అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కన్ను
కమీషన్ ఇస్తేనే పనులకు అనుమతి
లే అవుట్‌లో మౌలిక వసతుల పనులను అడ్డుకుంటున్న వైనం
కమీషన్ ముట్టజెప్పాలని ఒత్తిడి
గుమడాం, తామాడ పంచాయతీలకు చెందిన ఆ యా గ్రామ నాయకులు ఒక్కొక్కరూ ఒక్కో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి మధ్యవర్తులుగా వకాల్తా పుచ్చుకున్నారు. ఒక అధికార పార్టీ ప్రజా ప్రతినిధికి రూ.40 లక్షలు, మరో అధికార పార్టీ ప్రజా ప్రతినిధికి రూ.20 లక్షలు ఇవ్వాల్సిందేనని రియల్ వెంచర్ వేస్తున్న భూ యజమానుల ప్రతినిధులతో బేరసారాలకు దిగారు. చెప్పిన కమీషన్ ఇస్తేనే వెంచర్ పనులు ముందుకు వెళతాయి. లేదంటే ఇక్కడతో పనులు ఆపాల్సిందేనని నిత్యం వేధిస్తూనే ఉంటున్నారు. దీనిపై గత కొన్ని రోజలుగా పంచాయతీ నడుస్తుండటంతో ఈ రియల్ వెంచర్ టాపిక్ నియోజకవర్గంలో ఆ కూటమి నాయకుల్లోనే హాట్ టాఫిక్‌గా మారింది.


