సాక్షి, గుంటూరు: చంద్రబాబు పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్ర బాబు, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బయటపడకుండా చంద్రబాబు, లోకేష్ పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహారం నడుపుతున్నారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి ప్రాణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిందే.. గెలవాల్సిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తే.. కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని ఆమె మండిపడ్డారు.
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కూటమిలో ఉన్న పార్టీలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు సెమీ ఫైనల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు మిమ్మల్ని గెలిపిస్తారు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నాయకులను గెలిపించాలి. పార్టీ జెండా మోసిన ప్రతి వ్యక్తి మా మా బిడ్డ లాంటి వాళ్లే.


