స్కామ్‌పై సర్కారు సైలెన్స్‌! | Supreme Court fires back at appointment of unqualified teachers | Sakshi
Sakshi News home page

స్కామ్‌పై సర్కారు సైలెన్స్‌!

Sep 10 2026 4:08 AM | Updated on Sep 10 2026 5:24 AM

Supreme Court fires back at appointment of unqualified teachers

యువగళం దళానికి స్పోర్ట్స్‌ కోటాలో దొడ్డిదారిన టీచర్‌ ఉద్యోగాలు

టీచర్లుగా అనర్హుల నియామకాలపై తాజాగా ’సుప్రీం’ ఫైర్‌ 

మహారాష్ట్రలో ఫేక్‌ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల స్కామ్‌లో కీలక అరెస్టులు 

అక్రమాలను అరికట్టేందుకు డిజిటల్‌ వెరిఫికేషన్, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ అమలు

సాక్షి, అమరావతి: ‘‘అర్హత లేనివారికి టీచర్‌ పోస్టులా? అనర్హులను ఎందుకు నియమిస్తున్నారు? విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా చెలగాటమాడతారు? అడ్డదారి నియామకాలతో తరతరాల భవిష్యత్తు నాశనమే. నిర్దేశిత అర్హతలు లేనివారిని నియమిస్తే.. అలాంటి వారిని సర్వీసులో కొనసాగించొద్దు..’’ ఉపాధ్యాయుల నియామకాలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలివీ! 

» మెగా డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఉమ్మడి ప్రకాశం జిల్లా పుల్లల చెరువు జడ్పీ స్కూల్‌ టీచర్‌ పీవీసీహెచ్‌ బసవేశ్వరరావు 2015లో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్ ఖోఖో చాంపియన్‌ షిప్‌లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్‌ సమర్పించాడు. అయితే ఆయన చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేదని.. తమ వద్ద అలాంటి సమాచారం ఏదీ లేదని ఏపీ ఖోఖో అసోసియేషన్‌ స్వయంగా శాప్‌కు సమాచారం ఇచ్చినా టీచర్‌ పోస్టు కట్టబెట్టారు. 

»    2013లో ఖమ్మంలో రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సీనియర్‌ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించినట్టు సర్టిఫికెట్‌ సమర్పించిన ఓ మహిళ స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగం పొందింది. అయితే తాము అలాంటి సర్టిఫికెట్‌ జారీ చేయలేదని జూడో అసోసియేషన్‌ (తెలంగాణ) రాష్ట్ర కార్యదర్శి కైలాష్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.  

మహారాష్ట్రలో ‘బోగస్‌’ గుట్టురట్టు.. 
మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం స్పోర్ట్స్‌ కోటాను కొల్లగొట్టేందుకు పెద్దగా పరిచయం లేని మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడ ’కురాష్ ’ను తెరపైకి తెచ్చారు. 2016 నుంచి 2023 మధ్య ఏకంగా 1,500 వరకు నకిలీ సర్టిఫికెట్లతో సాగించిన భారీ కుంభకోణాన్ని ఇటీవల పుణే క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఛేదించారు. జరగని పోటీలను జరిగినట్లుగా చూపిస్తూ, మహిళల ఈవెంట్లలో పురుషుల పేర్లు చేర్చడంతోపాటు జిల్లా పేర్లను మార్చి జారీ చేసిన ఈ బోగస్‌ సర్టిఫికెట్లతో ఇప్పటికే 71 మంది (పోలీస్, ఇతర విభాగాల్లో) ఉద్యోగాలు పొందగా, ఎంపీఎస్సీ గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల్లోనూ వీటి­తో లబ్ధి పొందారని దర్యాప్తులో తేలింది. ఈ రాకెట్‌కు సంబంధించి అసోసియేషన్‌ కార్యదర్శి, అధ్యక్షుడిని అరెస్ట్‌ చేశారు. భవిష్యత్‌లో మోసాలను అరికట్టేందుకు డిజిటల్‌ వెరిఫికేషన్, బ్లాక్‌చెయిన్‌ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 

ఏపీలో ఎదురు దాడి...! 
మెగా డీఎస్సీ 2025 అక్రమాలు కళ్లకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా బాధిత అభ్యర్థులు బయటకు వస్తున్నా చంద్రబాబు సర్కారు నిర్భీతిగా బుకాయిస్తూ ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. యువగళం దళానికి టీచర్‌ పోస్టులు కట్టబెట్టింది. అందుకోసం ఏకంగా కొత్త జీవోలు తెచ్చి స్పోర్ట్స్‌ కేటగిరీలో దొడ్డిదారిన కట్టబెట్టింది. అక్రమాలకు గేట్లు ఎత్తి ఆ తర్వాత జీవోలు మార్చేసింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. 

ఏకంగా కులం, మతం కూడా మార్చేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు పోస్టు ఇవ్వలేదు. కేవలం పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌లు సమర్పించిన వారిని టీచర్లుగా నియమించారు. ఫస్ట్‌ ర్యాంకర్‌ నవీన్‌కు ఉద్యోగం ఇవ్వలేదు. ఇలాంటి అక్రమాలు వరుసగా వెలుగు చూశాయి. పలువురు అభ్యర్థులు సమర్పించిన స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లతో తమకు సంబంధం లేదని స్వయంగా ఆయా అసోసియేషన్లే ప్రకటించాయి. 

ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు చలించకపోవడం.. స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లపై తేల్చేందుకు మహారాష్ట్ర తరహాలో డిజిటల్‌ వెరిఫికేషన్, బ్లాక్‌ చెయిన్‌ లాంటి విధానాలను తేకపోవడం మెగా డీఎస్సీ స్కామ్‌కు పక్కా నిదర్శనమని విద్యావేత్తలు, రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించడంతోపాటు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌  రాజీనామా చేయాలని సూచిస్తున్నారు.

స్పోర్ట్స్‌ కోటాలో ఫేక్‌ సర్టిఫికెట్లు 
రాష్ట్ర జూడో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు ఆనం రామ్‌కిషోర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
నెల్లూరు (టౌన్‌): మెగా డీఎస్సీలో ఎక్కువ మంది స్పోర్ట్స్‌ కోటాలో ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొం­దారని రాష్ట్ర జూడో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు ఆనం రామకిషోర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొంది­న వారిలో ఎక్కువ మంది అసలు క్రీడాకారులే కాదు. నిజమైన క్రీడాకారులు ఈ విషయాన్ని బయ­ట చెప్పుకోలేరన్నారు.   

ట్యాంపర్‌ చేసి పేర్లు మార్చారు... 
‘కర్నూలు జిల్లాకు చెందిన షేక్‌ ఇస్మాయిల్‌ జూడో  ఫేక్‌ సర్టిఫికెట్లతోనే ఉద్యోగం పొందారు. 2018లో నెల్లూరులోని ఇన్‌ఫాంట్‌ జీసస్‌ స్కూల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొన్నట్లు ఆయన సర్టిఫికెట్‌ పెట్టారు. అయితే ఇస్మాయిల్‌ ఆ పోటీల్లో పాల్గొనలేదు. ఆ సమయంలో నేనే నెల్లూరు జిల్లా జూడో ప్రెసిడెంట్‌గా ఉన్నా.  ఏ ఛాంపియన్‌షిప్‌ జరిగినా జిల్లా అసోసియేషన్‌ దగ్గర ఒక రికార్డు, జిల్లా శాప్‌ కార్యాలయంలో ఒక రికార్డు, రాష్ట్ర శాప్‌ కార్యాలయంలో ఇంకో రికార్డు కలిపి మొత్తం 3 రికార్డులు ఉంటాయి. 

కానీ, వీటిని ట్యాంపర్‌ చేసి పేర్లు మార్చారు. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. మెగా డీఎస్సీలో ఫేక్‌ సర్టిఫికెట్ల వ్యవహారంపై సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌కు కొరియర్‌లో లేఖలు పంపా. అక్రమాలు బయట పెట్టానన్న అక్కసుతో నన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈ అక్రమాలపై కోర్టులో కూడా కేసులు వేశా. అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’ అని రామకిషోర్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement