ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై మీ వైఖరి ఏంటి? | High Court orders state government on EWS | Sakshi
Sakshi News home page

ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై మీ వైఖరి ఏంటి?

Sep 10 2026 4:39 AM | Updated on Sep 10 2026 4:39 AM

High Court orders state government on EWS

తీసుకొచ్చిన చట్టాలను అమలు చేస్తారా? పునఃసమీక్షిస్తారా? 

ఏం చేస్తారో చెప్పండి 

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్‌) విద్య, ఉద్యోగ అవకాశాలలో కల్పించిన 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాల అమలు విషయంలో వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాపులకు సంబంధిత 5 శాతం రిజర్వేషన్‌ చట్టాలను అమలు చేస్తారా? లేక వాటిని పునః సమీక్షిస్తారా? ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు విషయంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలుపై ఏం నిర్ణయం తీసుకుంటారు? తదితర వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)జస్టిస్‌ లీసాగిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

రిజర్వేషన్ల అమలుపై వ్యాజ్యాలు  
» కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాలను అమలు చేయకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.  

» విద్యా, ఉపాధి అవకాశాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ రాజమండ్రికి చెందిన అడ్డేపల్లి శ్రీధర్‌ లక్ష్మణ్, విజయవాడకు చెందిన కమ్మిలి కృష్ణ, ఉత్కర్ష్ పిటిషన్లు దాఖలు చేశారు.  

»   కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన 14, 15 చట్టాలను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెంకు చెందిన పెద్ది రామకృష్ణ, కర్నూలుకు చెందిన కె.చంద్రశేఖర శర్మ, మిత్రవింద తదితరులు కూడా పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. 

అనుకూల వాదనలు  
పిటిషనర్లు శ్రీధర్‌ లక్ష్మణ్, కృష్ణ తదితరుల తరఫు సీనియర్‌ న్యాయవాది పి.గంగయ్యనాయుడు, జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ,  ‘ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టాలు తీసుకొచ్చింది.  అయితే ఈ చట్టాలను మాత్రం అమలు చేయడం లేదు. ఈడబ్ల్యూఎస్‌ కోటా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 

సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించడాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది.  అదే సమయంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇస్తూ చేసిన చట్టాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో కాపులకు విద్యా, ఉపాధి అవకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు.  

ప్రతికూల వాదనలు 
కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సవాల్‌ చేసిన పెద్ది రామకృష్ణ తదితరుల తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ బాబు వాదనలు వినిపిస్తూ... ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చేసిన  103వ రాజ్యాంగ సవరణను సమర్థించిందన్నారు. దీనిని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసిందని తెలిపారు. అయితే ఈడబ్ల్యూఎస్‌  10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి సంబంధించిన వ్యాజ్యాల గురించి సుప్రీంకోర్టు ఆ తీర్పులో ప్రస్తావించలేదన్నారు. 

ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం ఉంటే అక్కడే రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసుకొని ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పులకు తాము భాష్యాలు చెప్పలేమంది. అలా అయితే సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి తగిన వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని ఇంద్రనీల్‌ కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement