కళ్లార్పకుండా ‘కహానీలు’ | Chandrababu credit exploitation on land resurvey | Sakshi
Sakshi News home page

కళ్లార్పకుండా ‘కహానీలు’

Sep 10 2026 4:16 AM | Updated on Sep 10 2026 4:16 AM

Chandrababu credit exploitation on land resurvey

భూముల రీసర్వేపై బాబు ‘డప్పు’   

క్యూఆర్‌ కోడ్, జియో హద్దులు, ఎల్‌పీఎం నంబర్లు.. అన్నీ జగన్‌ హయాంలోనివే.. 

కానీ, ఒక్క రాజముద్ర వేసుకుని అదంతా తన ఘనతేనంటూ చంద్రబాబు క్రెడిట్‌ దోపిడీ 

ఎన్నికల ముందు రీసర్వే ఆపేస్తామని చెప్పి ఇప్పుడు అది తన ఘనతేనని గొప్పలు 

20 లక్షల ఎకరాలను 22–ఏ జాబితాలో పెట్టిందీ ఆయనే.. 

వాటిలో 16 లక్షలు తీశానంటూ డబ్బా కొట్టుకుంటున్నదీ ఆయనే 

రెండేళ్లలో పరిష్కరించిన భూసమస్యలు సున్నా.. అయినా మార్చిలోపు రాష్ట్రంలో భూ సమస్యలన్నీ పరిష్కరించేస్తానని ప్రగల్భాలు 

ప్రతీనెలా ‘మీ భూమి–మీ హక్కు’ పేరుతో ఓ సభ.. అదే అబద్ధాల ప్రసంగం 

క్షేత్రస్థాయిలో మాత్రం పీజీఆర్‌ఎస్‌ క్యూలలో రైతుల వెతలు  

సాక్షి, అమరావతి : తాను చేయని పనిని చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు ఎక్కడలేని ‘తెలివితేటలు’ ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో భూముల రీసర్వే, 22–ఏ భూములకు విముక్తి, పట్టాదారు పాసుపుస్తకాల ఘనత తనదేనని నోటికొచ్చినట్లు అలవోకగా అబద్ధాలు వల్లెవేస్తున్నారు. తాను వ్యతిరేకించిన కార్యక్రమాన్ని తానే ప్రారంభించినట్లు, తాను 22–ఏలో పెట్టిన భూములకు తానే విముక్తి కల్పించినట్లు నిస్సిగ్గుగా అవాస్తవాలు మాట్లాడుతూ కళ్లార్పకుండా కహానీలు చెబుతుండడంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

క్యూఆర్‌ కోడ్‌ బాబు తెచ్చారా?.. 
రాష్ట్రంలో భూముల రీసర్వే మొదలైంది 2020 డిసెంబర్‌ 21న. అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లా తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకానికి వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఈ సర్వే కోసం దేశ చరిత్రలో తొలిసారిగా 14 వేల మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. 3,240 జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లు, వందలాది డ్రోన్లు, నాలుగు హెలికాప్టర్లు, రెండు విమానాలు, 70 కార్స్‌ స్టేషన్ల నెట్‌వర్క్‌తో అనేక వ్యయ ప్రయాసలతో ఏర్పాటుచేశారు. మొత్తం 2.47 కోట్ల సర్వే నంబర్లలోని భూమిని కొలిచి కొత్తగా 86,80,246 ఎల్‌పీఎం (ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌) నంబర్లు జారీ చేశారు. 

13,500 గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయి డిజిటల్‌ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. సర్వే నెంబర్ల స్థానంలో ఎల్‌పీఎం నెంబర్లు వచ్చింది అప్పుడే. 30 లక్షల మంది రైతులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూహక్కు పత్రాలు ఇచ్చారు. పాస్‌ పుస్తకంపై క్యూఆర్‌ కోడ్, ప్రతి భూమికీ జియో హద్దులు, ప్రతి పార్సిల్‌కూ ఐడీ నంబరు, ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌.. ఇలా ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్న ప్రతిదీ అప్పటిదే. 2022 సెపె్టంబర్‌లో జారీ అయిన పాస్‌ పుస్తకాలపై ఆ క్యూఆర్‌ కోడ్‌ ఇప్పటికీ ఉంది. రైతుల చేతుల్లో ఆ సాక్ష్యం ఉండగా చంద్రబాబు కళ్లార్పకుండా చెబుతున్న అబద్ధాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

రీ సర్వే ఆపేస్తానని.. క్రెడిట్‌ దోపిడీ..
రీసర్వే వల్ల రైతులకు నష్టమని, మీ భూములు ఎక్కడున్నాయో తెలుసుకుని ఆక్రమించడానికే ఈ సర్వే అని.. ఇక మీ భూములు మీవి కావని, తాము అధికారంలోకి రాగానే రీసర్వేను ఆపేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు ఊరూవాడా హోరెత్తించారు. అయితే, అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు రీసర్వేను నిజంగానే నిలిపివేశారు. ఆ తర్వాత అదే చంద్రబాబు రాష్ట్రంలో రీసర్వే అద్భుతంగా జరిగిందని కేంద్రానికి లేఖ రాసి రూ.500 కోట్ల రాయితీని సిగ్గులేకుండా తెచ్చుకున్నారు. ఆ డబ్బు వచ్చింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన పనికి. ఇలా ఢిల్లీలో గొప్పలకు పోవడం.. రాష్ట్రంలో బురదజల్లడం చంద్రబాబుకే చెల్లింది. నిజానికి.. చంద్రబాబు వచ్చాక ఒక్క గ్రామంలో కూడా రీసర్వే పూర్తికాలేదు.

రాజముద్ర వేసి తానే చేశానంటే సరా?.. 
ఇక పట్టాదారు పాస్‌ పుస్తకాలను రాజముద్రతో ఇచ్చానని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. పుస్తకంలో రైతుకు ఉపయోగపడేది బొమ్మ కాదు, క్యూఆర్‌ కోడ్, జియో హద్దులు, ఎల్‌పీఎం నంబరు. ఆ మూడూ ఎక్కడివో బాబుకు బాగా తెలుసు. లోగో మార్చడం సంస్కరణ కాదు. అలాగే, స్టిక్కర్‌ మార్చి చరిత్ర సృష్టించినట్లు డప్పు కొట్టుకోవడం ఆయన అవివేకం. జగన్‌ హయాంలో పాతిన సర్వే రాళ్లపై నవరత్నాల లోగో ఉందని, సీఎం ఫొటో ఉందని ఆయన ఇప్పటికీ విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిజానికి అది వాటర్‌మార్క్‌ లోగో మాత్రమే. సర్వే ఎప్పుడు జరిగిందో, ఏ ప్రామాణికతతో జరిగిందో శాశ్వతంగా గుర్తుండేందుకు వేసిన ముద్ర. అది తప్పయితే ఇప్పుడు పింఛన్ల పంపిణీ పాంప్లెట్ల నుంచి ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలోనూ చంద్రబాబు ఫొటో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు?.

22–ఏ నుంచి 16 లక్షలు ఎకరాలు తీసేశారా? 
మరోవైపు.. 16 లక్షల ఎకరాలను 22–ఏ జాబితా నుంచి తొలగించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు అసలు వాటిని అందులో పెట్టింది తానేననే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే.. 2024లో అధికారంలోకి రాగానే రాజకీయ కక్షతో 20 లక్షల ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో పెట్టింది సాక్షాత్తు చంద్రబాబే. అందులో 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూ­ము­లు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్‌ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతు­లు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములు ఉన్నాయి. 

అనే­క వి­చా­రణల తర్వాత ఆ భూములన్నీ సక్రమమేనని ప్రభుత్వం నిగ్గుతేల్చింది. ఈ నేపథ్యంలో.. తప్పు ఒప్పుకోవడం మానేసి, ఇప్పుడు వాటిని తొలగిస్తూ తానే విముక్తి కల్పించానని సిగ్గులేకుండా డబ్బా కొట్టుకుంటున్నారు. ఇక జగన్‌ హయాంలో ఏకకాలంలో వేల గ్రామాల్లో సర్వే బృందాలు దూసుకుపోతే, ఇప్పుడు నెలకు వంద గ్రామాల్లో కూడా జరగడం లేదు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్వే బృందాలను కుదించి, రైతును మళ్లీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుతున్నారు. పైగా.. ఇప్పుడు ఆటో మ్యుటేషన్‌ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నా అది రీ సర్వేలో భాగంగానే గతంలోనే మొదలైందన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. 

మార్చిలోగా అన్ని భూ సమస్యలకు పరిష్కారమా? 
ఇదిలా ఉంటే.. మార్చిలోపు రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేస్తానని చంద్రబాబు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. గడచిన రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క భూ సమస్యను పరిష్కరించలేక ప్రతీ సమావేశంలోనూ అధికారులపై నిందలు వేస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌లో ఏడు లక్షలకు పైగా భూ సమస్యలపై అర్జీలు వస్తే 6.20 లక్షలు పరిష్కరించేసినట్లు ప్రకటించుకున్నారు. అందులో ఒక్క శాతం సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోయినా అయినట్లు మెసేజ్‌లు పంపారు. 

అయితే, మార్చికల్లా చంద్రబాబు చూపే పరిష్కారం కూడా ఇలాగే ఉంటుందని జనం ఆయన మాటలు విని నవ్వుకుంటున్నారు. ఇలా ప్రతీనెలా ‘మీ భూమి–మీ హక్కు’ పేరుతో ఓ సభ.. అదే అబద్ధాల ప్రసంగం చేయడం ఆయనకు అలవాటుగా మారింది. కానీ, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. పైగా.. ఒక్కటీ పరిష్కారం కావడంలేదు. అయినా చంద్రబాబు మాటలు కోటలు దాటుతూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement