15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు | Srivari Salakatla Brahmotsavams in Tirumala from 15th to 23rd of this month | Sakshi
Sakshi News home page

15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Sep 10 2026 4:18 AM | Updated on Sep 10 2026 4:18 AM

Srivari Salakatla Brahmotsavams in Tirumala from 15th to 23rd of this month

తిరుమల: తిరుమలలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు చెప్పారు. ఈ నెల 14న రాత్రి 7 గంటలకు అంకురార్పణ జరుగుతుందని, 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తామని తెలిపారు. తిరుమలలో బుధవారం ఆయన అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వామికి పట్టువ్రస్తాలు సమర్పించి, పెద్ద శేషవాహనసేవలో పాల్గొంటారని చెప్పారు. రిలయన్స్‌ సంస్థ టీటీడీకి విరాళంగా ఇచ్చిన 25 ఎలక్ట్రిక్‌ బస్సులను ఈ నెల 16న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని, 2027కు సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరిస్తారని తెలిపారు. వైభవంగా నిర్వహించనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.  

భక్తులకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 
తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నట్లు చెప్పారు. తిరుమలలో సహజ మరణం సంభవించే భక్తులకు కూడా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పథకం అమలు చేస్తామన్నారు. మరణించిన భక్తుడి కుటుంబానికి ఈ పథకం కింద రూ.2 లక్షలు చెల్లించనున్నట్లు తెలిపారు. 

నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి, చెన్నైలోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరి, జేఈవోలు డాక్టర్‌ ఎ.శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్‌వో మురళీకృష్ణ, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement