ఏఐ ఫోటో
కోబ్రా(ఛత్తీస్‌గఢ్): రోజుకు కొన్ని నిమిషాలు కాలక్షేపం కోసం కొందరు స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్ చూడటం ఇప్పుడు సర్వసాధారణమైంది. వైఫై సమస్యలు, ఇతరత్రా కారణాలతో ఇంటర్నెట్ సరిగా రాకపోతే ఫోన్ వెంటనే పక్కనపెట్టేస్తారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో 52 ఏళ్ల మహిళ మాత్రం ఫోన్‌లో రీల్స్‌కు అతిగా బానిసై ఇంటర్నెట్ సరిగా రాకపోవడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం కోర్బా జిల్లాలోని కర్తాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేరాకచ్ఛార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మంగ్లో బాయ్ సారిథి అనే మహిళ శనివారం ఫోన్‌లో రీల్స్ చూస్తున్నప్పుడే వెంటవెంటనే ఇంటర్నెట్ సమస్య వచ్చింది . రీల్స్ వీడియోలు ప్లే కావడంలేదు. ఇష్టమైన రీల్స్ చూడలేకపోతున్నాననే అసహనంతో ఫోన్‌ను విసిరికొట్టింది. దెబ్బకు ఫోన్ ముక్కలుచెక్కలైంది. వెంటనే ఆమె ఇంట్లోని పురుగుల మందు తాగేసింది. ఇదంతా చూసిన 17 ఏళ్ల కూతురు వెంటనే కుటుంబసభ్యులకు తెలిపింది. మంగ్లోను వెంటనే కర్తాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కోర్బాలోని వైద్య బోధనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది.


