జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.. | GST Council Meeting Postponed to October 7 is BRICS Summit Changed the Date | Sakshi
Sakshi News home page

జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

Sep 9 2026 9:44 AM | Updated on Sep 9 2026 9:44 AM

GST Council Meeting Postponed to October 7 is BRICS Summit Changed the Date

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి 57వ సమావేశం వాయిదా పడింది. సెప్టెంబర్‌ 12న జరగాల్సిన ఈ భేటీని అక్టోబర్‌ 7కు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్లు ఢిల్లీలోనే ఈ సమావేశం జరగనుంది. వాయిదాకు అధికారికంగా కారణం వెల్లడించనప్పటికీ, ఇదే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు-2026 నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిక్స్‌ సదస్సు ఏర్పాట్ల దృష్ట్యా సెప్టెంబర్‌ 11న ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్త సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు.

గత ఏడాది సెప్టెంబర్‌ 3న చివరిసారిగా జీఎస్టీ మండలి భేటీ జరిగింది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి సమావేశం జరగాలి. అయితే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సహా పలు కారణాలతో ఈసారి ఆలస్యం అయింది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన సాగే ఈ మండలిలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రితో పాటు, రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

ఈసారి భేటీలో వీటికి అవకాశం..

ఇంకా అజెండా ఖరారు కాకపోయినా ఈసారి భేటీలో పన్ను వర్తింపు (కంప్లయెన్స్‌), వ్యాపార సౌలభ్యంపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశముంది. నెలకు రూ.2.5 లక్షలకు మించి పన్ను క్రెడిట్‌ బదిలీ చేసే వ్యాపారుల జీఎస్టీ నమోదు దరఖాస్తుల వేగవంతమైన ప్రాసెసింగ్‌ కోసం ఏకరూప పత్రాల మార్గదర్శకాలు ఖరారు చేసే ప్రతిపాదన చర్చకు రానుంది. గతేడాది సెప్టెంబర్‌ 3 సిఫార్సు మేరకు నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన సరళీకృత పన్ను నమోదు విధానం, చిన్న-తక్కువ రిస్క్‌ వ్యాపారులకు వర్తిస్తోంది. ప్రస్తుతం 65 శాతం నమోదులు ఈ మార్గంలోనే జరుగుతుండగా మిగతా 35 శాతం పెద్ద వ్యాపారులకూ సరళ విధానం తేవాలని యోచిస్తున్నారు.

అదే సమయంలో, సంచిత పరిహార సెస్‌ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. జీఎస్టీ పరిహార సెస్‌ క్రెడిట్‌ బదిలీ, రీఫండ్‌పై కేంద్రం నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. ఇది సుమారు రూ.2,500 కోట్ల విలువైనదిగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జీఎస్టీ 2.0 ప్రకటన అనంతరం, సెప్టెంబర్‌ 22, 2025 నుంచి కొత్త విధానం అమల్లోకి రాకముందే తమ ఎలక్ట్రానిక్‌ క్రెడిట్‌ లెడ్జర్లలో ఉన్న సెస్‌ నిల్వలను కొనసాగించాలని ఆటో డీలర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్‌.. ధర ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement