వివిధ రాష్ట్రాల్లో గతేడాది ఆగస్టుతో పోలిస్తే.. ఈ ఆగస్టులో నమోదైన జీఎస్టీ రాబడి వృద్ధి
రాష్ట్రంలో 7 శాతం క్షీణించిన జీఎస్టీ ఆదాయం
గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి రూ.272 కోట్లు తగ్గుదల
ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ రాబడి 1.14 శాతం క్షీణత
బిహార్ సహా ఇతర రాష్ట్రాల్లో భారీగా వృద్ధి నమోదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్ర జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఆదాయం మరోసారి పడిపోయింది. వరుసగా మూడో ఏడాది కూడా నేల చూపులు చూస్తోంది. సంపద సృష్టిస్తానంటూ ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర సంపదను పూర్తిగా ఆవిరి చేస్తున్నారు. జీఎస్టీ ఆదాయం గతేడాది కన్నా ఈ ఏడాది మెరుగ్గా ఉంటే దాన్ని సంపద వృద్ధి అంటారు. కానీ చంద్రబాబు పాలనలో గతేడాది ఆగస్టులో వచ్చిన జీఎస్టీ ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 7 శాతం క్షీణత నమోదైంది.
గతేడాది ఆగస్టులో రూ.3,710 కోట్ల జీఎస్టీ రాబడి ఉండగా.. ఈ ఆగస్టులో రూ.3,438 కోట్లకే పరిమితమైంది. అంటే రూ.272 కోట్ల మేర పతనమైందని స్పష్టమవుతోంది. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లో జీఎస్టీ రాబడి రూ.18,393 కోట్లే వచ్చింది. అంటే గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చి చూస్తే 1.14 శాతం క్షీణత నెలకొంది. దేశంలో బిహార్ సహా మిగతా రాష్ట్రాల్లో వృద్ధి నమోదవుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నెలనెలా పరిస్థితి దిగజారడం గమనార్హం.


