ఆగస్టులో దాదాపు రూ. 2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు దుమ్మురేపుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు్టలో 14.8 శాతం జంప్‌చేసి, రూ. 1,99,853 కోట్లకు చేరాయి. ప్రధానంగా దేశీ లావాదేవీలు, దిగుమతులు దీనికి దోహదం చేశాయి. పశ్చిమాసియా సంక్షోభ ప్రతికూలతలు, టారిఫ్ అడ్డంకులు నెలకొన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయ్యేందుకు దేశీ వినియోగమే దన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, దేశీ లావాదేవీల నుంచి జీఎస్‌టీ ఆదాయం 9.3 శాతం ఎగసి రూ. 1.37 లక్షల కోట్లను తాకగా.. దిగుమతుల నుంచి ఆదాయం 29 శాతం దూసుకెళ్లి రూ.62,604 కోట్లుగా నమోదైంది.
⇒ ఆగస్టులో స్థూల కేంద్ర జీఎస్‌టీ వసూళ్లు రూ.38,413 కోట్లుగా ఉన్నాయి. రాష్ట్ర జీఎస్‌టీ 46,316 కోట్లు కాగా, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.1,15 లక్షల కోట్లకు చేరుకుంది.
⇒ రిఫండ్లు 68 శాతం పెరుగుదలతో రూ. 31,795 కోట్లుగా నమోదయ్యాయి.
⇒ నికర జీఎస్‌టీ వసూళ్లు రూ.1,68 లక్షల కోట్లు. 8.3 శాతం వృద్ధి చెందాయి.
⇒ ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు ఐదు నెలల కాలంలో జీఎస్‌టీ ఆదాయం 11% ఎగబాకి రూ.10.43 లక్షల కోట్లను తాకింది. గతేడాదితో పోలిస్తే వసూళ్లలో నిలకడకు ఇది అద్దం పడుతోంది.
⇒ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు జీఎస్‌టీ వసూళ్లే నిదర్శమని ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్‌నర్ సౌరభ్ అగర్వాల్ పేర్కొన్నారు. రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో వినియోగదారుల వ్యయం మరింత పెరుగుతుందని, ఈ దన్నుతో వచ్చే రెండు నెలల్లో పన్ను వసూళ్లు మరింత పుంజుకుంటాయని ఆయన చెప్పారు.


