కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో వచ్చారు. తనను ‘పారిపోయిన అప్పులవాడు’ (బగోడా)గా ముద్ర వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను 1992 నుంచే బ్రిటన్‌లో శాశ్వత నివాసిగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం చట్టపరమైన ఆంక్షల వల్లే యూకే వదిలి రాలేకపోతున్నానని ఎక్స్ వేదికగా వరుస పోస్టుల ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తనకు ఘోరమైన అన్యాయం చేసిందని ఆరోపించారు.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత ఏడాది అక్టోబర్‌లో లోక్‌సభలో ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్-2018 కింద 15 మందిని ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించినట్టు, అందులో మాల్యా, నీరవ్ మోదీ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఇప్పుడు మాల్యా మాత్రం ‘నేను తప్పించుకుని తిరగడం లేదు, న్యాయపరమైన బంధనాలే నన్ను ఆపుతున్నాయి’ అంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు.
ఇది కేవలం మాటల యుద్ధంతో ఆగిపోలేదు. బ్యాంకులు, ప్రభుత్వం తన నుంచి కోర్టు తీర్పు ప్రకారం రావాల్సిన రూ.6,203 కోట్లకు గాను రూ.14,100 కోట్లు వసూలు చేసినట్టు అంగీకరించారని మాల్యా చెప్పారు. అయినా తనను మోసగాడిగా చిత్రీకరించడం అన్యాయం అన్నారు. తనకు రావాల్సిన రిఫండ్ సంగతేమిటని ఎదురుదాడికి దిగారు. ఇక ఫిబ్రవరిలో బాంబే హైకోర్టు మాత్రం.. కోర్టు విచారణలకు దూరంగా ఉంటూ న్యాయమైన ఉపశమనం కోరడం భావ్యం కాదు అని మాల్యాను తీవ్రంగా మందలించింది. చివరిసారిగా భారత్ తిరిగొచ్చే ఉద్దేశం ఉందో లేదో స్పష్టం చేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..


