ఇజ్రాయెల్‌లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా? | Netanyahu Faces Fresh Political Storm As Report Claims UAE Warned Him About Hamas Attack Plans | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా?

Sep 9 2026 8:59 AM | Updated on Sep 9 2026 9:59 AM

Opposition Leaders fire On Netanyahu over UAE October 7 Alert

‘నెతన్యాహు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదు!’.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై విపక్ష నేతల ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ దాడికి కొద్ది రోజుల ముందే యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ నెతన్యాహును హెచ్చరించారన్న సంచలన నివేదిక వెలుగులోకి రావడంతో.. దాడి ముప్పు ముందే తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

హారెట్జ్‌ కథనం ప్రకారం.. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్‌ 7 దాడికి సుమారు వారం, పది రోజుల ముందు యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌.. నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. హమాస్‌ భారీ స్థాయిలో ఓ ఆపరేషన్‌కు సిద్ధమవుతోందని ఆయన హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. అప్పటి హమాస్‌ నేత యాహ్యా సిన్వార్‌ ఓ మాజీ పాలస్తీనా అధికారికి తమ సంస్థ భయంకరమైన ఆపరేషన్‌కు సిద్ధమవుతోందని చెప్పినట్లు పేర్కొంది. దాన్ని ఆ మాజీ అధికారి యూఏఈ సలహాదారుకు చేరవేశారు. ఆ సలహాదారు ఈ సమాచారాన్ని యూఏఈ అధ్యక్షుడికి చెప్పడంతో.. ఆయన నేరుగా నెతన్యాహును సంప్రదించినట్లు కథనం చెబుతోంది. అంతేకాదు.. హమాస్‌ నుంచి వచ్చే ముప్పుపై ఇజ్రాయెల్‌కు ఇతర మార్గాల్లోనూ హెచ్చరికలు వచ్చినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. గాజా సరిహద్దులో ఉన్న మరో దేశం ఈజిప్ట్‌కు చెందిన నిఘా అధికారులు కూడా దాడికి కొద్దికాలం ముందు ‘ఏదో పెద్ద విషయం జరగబోతోంది’ అంటూ ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు గత ఏడాది ఓ ఇజ్రాయెల్‌ పత్రిక వెల్లడించింది.

పొలిటికల్‌ దుమారం.. 
ఈ నేపథ్యంలో నెతన్యాహుపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ సైనిక కమాండర్‌ గాడి ఐసెన్‌కాట్‌.. నెతన్యాహుకు డజన్ల కొద్దీ హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదని, భద్రతా వైఫల్యాలకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ కూడా నెతన్యాహు ఇక పదవిలో కొనసాగకూడదని వ్యాఖ్యానించారు. మరో మాజీ ప్రధాని, ఎన్నికల బరిలో ఉన్న నఫ్తాలీ బెన్నెట్‌ కూడా నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నెతన్యాహు ఇక ఒక్క నిమిషం కూడా తన పదవిలో కొనసాగకూడదు’ అని అన్నారు. అయితే ఈ ఆరోపణలను నెతన్యాహు కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అక్టోబర్‌ 7కు ముందు యూఏఈ నుంచి ప్రధానికి ఎలాంటి హెచ్చరిక అందలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం నిజమేనా? హెచ్చరిక అందిందా? అందితే దానిపై నెతన్యాహు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అనే అంశాలపై రాజకీయ దుమారం మొదలైంది.

ఇక, 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై భారీ దాడికి దిగింది. పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమంపైనా దాడి జరగడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. అధికారిక ఇజ్రాయెల్‌ గణాంకాల ఆధారంగా ఈ దాడిలో 1,221 మంది మరణించారు. మరో 251 మందిని హమాస్‌ బందీలుగా గాజాకు తీసుకెళ్లింది. వారిలో 44 మంది ఇప్పటికే మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్‌ గాజాపై భారీ సైనిక చర్య చేపట్టింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో గాజాలో విపరీతమైన ప్రాణనష్టం, విధ్వంసం చోటుచేసుకుంది.

ఎన్నికలపై ఎఫెక్ట్‌?
అక్టోబర్‌ 7 దాడిని అడ్డుకోవడంలో విఫలమైన భద్రతా వ్యవస్థపై ఇజ్రాయెల్‌లో చాలాకాలంగా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు యూఏఈ హెచ్చరికకు సంబంధించిన తాజా నివేదిక ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. హమాస్‌ దాడి ముప్పు ముందే తెలిసిందా? తెలిసి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందా? లేక తాజా ఆరోపణలు రాజకీయ ప్రత్యర్థుల ప్రచారమేనా? అన్నదానిపై ఇజ్రాయెల్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. అక్టోబర్‌ 27న జరగనున్న ఎన్నికలకు ముందు ఈ అంశం నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ఇరాన్‌కు దిమ్మతిరిగే షాక్‌.. భారీ దెబ్బకొట్టిన అమెరికా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement