మహిళా సిబ్బందిని తప్పించడంపై నిరసన ఈఫిల్‌ టవర్‌ మూసివేత | Eiffel Tower employees strike after female staff removed | Sakshi
Sakshi News home page

మహిళా సిబ్బందిని తప్పించడంపై నిరసన ఈఫిల్‌ టవర్‌ మూసివేత

Sep 9 2026 2:37 AM | Updated on Sep 9 2026 2:37 AM

Eiffel Tower employees strike after female staff removed

హిందూ సంస్థ ప్రతినిధుల పర్యటన 

మహిళా ఉద్యోగులను దూరం పెట్టారన్న సిబ్బంది 

ఇది లింగ వివక్ష అంటూ సమ్మె

లండన్‌/న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ సోమవారం మూతపడింది. హిందూ మత సంస్థ స్వామి నారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ప్రతినిధుల పర్యటన సందర్భంగా టవర్‌ మహిళా సిబ్బందిని పక్కకు తప్పించడంతో సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సమ్మెకు దిగడం ఇందుకు కారణమైంది. అయితే బీఏపీఎస్‌ క్షమాపణలు చెప్పడం, సిబ్బంది, టవర్‌ యాజమాన్యాల మధ్య జరగిన చర్చలు విజయవంతం కావడంతో మంగళవారం ఈఫిల్‌ టవర్‌ యాథావిధిగా సందర్శకులకు అందుబాటులో ఉంటుందని సమాచారం. బీఏపీఎస్‌ ఆదివారం ఫ్రాన్స్‌లోనే మొదటి ఆలయాన్ని ప్రారంభిచింది. దీనికి ఒకరోజు ముందు సుమారు 100 మంది బీఏపీఎస్‌ ప్రతినిధులు ఈఫిల్‌ టవర్‌ను సందర్శించారు. 

అయితే తమ పర్యటన సందర్భంగా మహిళలతో సంబంధాలు తక్కువగా ఉండేలా చూడాలని బీఏపీఎస్‌ కోరినట్లు తెలిసింది. దీంతో టవర్‌ నిర్వహణ కార్యకలాపాలు చూస్తున్న సిబ్బందిలో మహిళలను వారు పనిచేస్తున్న చోటి నుంచి తప్పుకోవాల్సిందిగా కోరారని ఉద్యోగ సంఘాల ప్రతినిధి డయాన్‌ డావోయిన్‌ ఫ్రెంచ్‌ టీవీకి తెలిపారు. కొన్ని చోట్ల మహిళల స్థానంలో పురుషులను నియమించారని, ప్రతినిధులు ఉన్న చోటకు వెళ్లకుండా మహిళా ఉద్యోగులను నియంత్రించారని, ఇది కచి్చతంగా లింగ వివక్షేనని సీజీటీ ట్రేడ్‌ యూనియన్‌ ఆరోపించింది. ఈఫిల్‌ టవర్‌ను ఏటా దాదాపు 70 లక్షల మంది సందర్శిస్తూంటారు. ఈఫిల్‌ టవర్‌ను నిర్వహించే సెటే సంస్థతోపాటు పలువురు రాజకీయ నేతలు ఈ ఘటను తీవ్రంగా ఖండించారు. 

‘ఇలాంటి షరతులను అంగీకరించకూడదు’అని సెటే స్పష్టం చేసింది. పారిస్‌ మేయర్‌ ఇమ్మాన్యుయేల్‌ గ్రెగోయిర్‌ కూడా ఉద్యోగుల ఆగ్రహం సమంజసమైందేనని వారికి మద్దతు తెలిపారు. లింగ వివక్షకు పాల్పడటం సరికాదని ఆయన ‘ఎక్స్‌’పోస్టులో స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో స్త్రీ, పురుష బేధం లేదని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సంచరించగలగడం ఈ దేశపు విలువల్లో భాగమని అన్నారు. ఫ్రాన్స్‌ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు యాయెల్‌ బ్రాన్‌–పివే, లింగ సమానత్వం, వివక్ష వ్యతిరేక శాఖల మంత్రి ఆరోర్‌ బెర్జ్, మాజీ ప్రధాని గాబ్రియేల్‌ అట్టల్‌లు కూడా ఘటనను తప్పుపట్టారు.  

బీఏపీఎస్‌ క్షమాపణ 
ఈ వివాదంపై పారిస్‌లోని బీఏపీఎస్‌ హిందూ ఆలయ నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు. సిబ్బంది ఆందోళనలను తాము అర్థం చేసుకున్నామని తెలిపారు. సాధారణ సందర్శకులకు ఇబ్బంది కలగకూడదనే తాము ఉదయాన్నే పర్యటన కార్యక్రమం పెట్టుకున్నామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement