ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ సంస్థ బాప్స్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా మహిళా సిబ్బందిని విధుల నుంచి తప్పించి, వారి స్థానంలో పురుష ఉద్యోగులను నియమించారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. దీంతో ఉద్యోగులు నిరసనకు దిగడంతో ఈఫిల్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శనివారం సుమారు 100 మంది సభ్యులతో కూడిన బోచాసన్వాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (BAPS) బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించింది. బృందం వెళ్లే సమయంలో మహిళా ఉద్యోగులు కనిపించకుండా పక్కకు తప్పుకోవాలని, వారి స్థానాల్లో పురుష సిబ్బంది ఉండాలని ఆదేశించినట్లు యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ ఘటనపై ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ సెటె(SETE) కూడా స్పందించింది. పర్యటన నిర్వాహకుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అలా స్పందించామని, అసలు అలాంటి షరతులను అంగీకరించాల్సింది కాదని సంస్థ అంగీకరించింది. ఉద్యోగులకు యాజమాన్యం క్షమాపణలు చెప్పినట్లు యూనియన్ తెలిపింది.
ఈ వ్యవహారంపై పారిస్ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ విచారణకు ఆదేశించారు. మహిళలు, పురుషులు ఎలాంటి వివక్ష లేకుండా పనిచేసే హక్కు కలిగి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు యాయెల్ బ్రాన్-పివే కూడా ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.. విదేశీ సందర్శకుల అభ్యర్థనల కోసం మహిళలను పక్కకు తప్పించడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పారిస్ శివార్లలో బాప్స్ తొలి భారీ హిందూ దేవాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలను ఈ ఆలయం మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తనకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఆ ఆలయం సందర్శిస్తానని మోదీ చెప్పారు.
ఇదీ చదవండి: ‘భయం’పై నిర్భయ ప్రయోగం


