కార్బన్‌ క్రెడిట్‌లో భారత్‌కు బ్రిటన్‌ గ్రీన్‌ సిగ్నల్‌! | No More Double Carbon Tax UK Recognises India CCTS Major Trade Win | Sakshi
Sakshi News home page

కార్బన్‌ క్రెడిట్‌లో భారత్‌కు బ్రిటన్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

Sep 8 2026 8:33 AM | Updated on Sep 8 2026 8:42 AM

No More Double Carbon Tax UK Recognises India CCTS Major Trade Win

భారత్‌-బ్రిటన్‌ వాణిజ్య బంధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూకే తన కార్బన్‌ బార్డర్‌ అడ్జస్ట్‌ మెకానిజం(సీబీఏఎం) కింద అర్హతగల కార్బన్‌ ధరల విధానాల జాబితాలో భారత్‌ కార్బన్‌ క్రెడిట్‌ ట్రేడింగ్‌ స్కీమ్‌ (సీసీటీఎస్‌)ను అధికారికంగా చేర్చింది. దీంతో సీబీఏఎం పరిధిలోకి వచ్చే భారత ఉత్పత్తులను దిగుమతి చేసుకునే బ్రిటిష్‌ సంస్థలు సీసీటీఎస్‌ కింద ఆయా వస్తువులపై చెల్లించిన కార్బన్‌ ధరకు అనుగుణంగా ఆధారాలు, ధ్రువీకరణ షరతులకు లోబడి రిలీఫ్‌ పొందే వెసులుబాటు లభించనుంది. అంటే, ఒకసారి కార్బన్‌ భారం పడిన సరుకుపై మళ్లీ పన్ను వేయకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

వాణిజ్య మంత్రిత్వ శాఖ, బ్రిటన్‌ ప్రతినిధుల మధ్య సాంకేతిక స్థాయిలో సుదీర్ఘ చర్చల ఫలితంగానే ఈ గుర్తింపు లభించింది. సొంత దేశంలో ఇప్పటికే కార్బన్‌ ధర భరించిన సరుకులపై మళ్లీ పన్ను వేయకూడదన్నదే యూకే సీబీఏఎం మౌలిక సూత్రమని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బ్రిటన్‌ ప్రస్తుతం యూరోపియన్‌ యూనియన్‌ ఎమిషన్స్‌ ట్రేడింగ్‌ సిస్టమ్‌ సహా 16 అర్హతగల కార్బన్‌ ధరల పథకాలను గుర్తిస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో భారత్‌ చేరడం విశేషం.

నిజానికి, గత మే నెలలో అమల్లోకి వచ్చిన భారత్‌-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సందర్భంగా సీబీఏఎం నుంచి మినహాయింపు కోసం భారత్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు. 2027 జనవరి నుంచి ఉక్కు, అల్యూమినియంపై యూకే కార్బన్‌ పన్ను విధించే అవకాశం ఉండటంతో ఇది తీవ్ర అసమానతకు దారితీస్తుందని నిపుణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా గుర్తింపు కొంత నష్టనివారణలా కనిపిస్తున్నా, పూర్తి మినహాయింపు కాదన్నది గమనార్హం.

కార్బన్‌ క్రెడిట్‌ అంటే..

ఒక టన్ను కార్బన్‌ డయాక్సైడ్‌ (లేదా దానికి సమానమైన గ్రీన్‌హౌస్‌ వాయువులు) వాతావరణంలోకి విడుదల కాకుండా ఆపగలిగితే లేదా అంతే మొత్తాన్ని వాతావరణం నుంచి తొలగించగలిగితే దానికి గుర్తుగా ఒక క్రెడిట్‌ లభిస్తుంది. అంటే, ఒక కార్బన్‌ క్రెడిట్‌ = ఒక టన్ను కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాల తగ్గింపు లేదా నివారణ. ప్రభుత్వాలు లేదా నియంత్రణ సంస్థలు కంపెనీలకు నిర్దిష్ట కార్బన్‌ ఉద్గార పరిమితి (క్యాప్‌) విధిస్తాయి. ఏదైనా కంపెనీ ఈ పరిమితి కంటే తక్కువ ఉద్గారాలు వెలువరిస్తే మిగిలిన మొత్తానికి క్రెడిట్లు లభిస్తాయి. పరిమితి మించి ఉద్గారాలు వెలువరించే కంపెనీలు, తక్కువ ఉద్గారాలు చూపిన కంపెనీల నుంచి ఈ క్రెడిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. దీన్నే క్యాప్‌ అండ్‌ ట్రేడ్‌ విధానం అంటారు. అంటే, కాలుష్యానికి ధర పెట్టి, తక్కువ కాలుష్యం చేసేవారికి ప్రతిఫలం ఇవ్వడం.

ఇదీ చదవండి: జీవించి ఉండగానే పిల్లలకు ఆస్తి రాస్తున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement